తనకు ఇష్టమైన వైజాగ్ నగరం నుంచే జనసేన పార్టీలోకి చేరికలు ప్రారంభంకావడం సంతోషంగా ఉందని జనసేన పార్టీ అధినే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్టణానికి చెందిన ఐదుగురు వైకాపా కార్పొరేటర్లు మంగళవారం పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పవన్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్నాళ్లు ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉన్నాను. నాకు ఇష్టమైన విశాఖపట్టణం నుంచే జనసేన పార్టీలోకి చేరికలు ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. వైకాపా నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఇదే విషయం గతంలో పలుమార్లు చెప్పాను. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జనసేన పార్టీలో చేరిన వారందరికీ నా తరపున ధన్యవాదాలు. మీ సేవలను పార్టీ గుర్తిస్తుంది.
అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు సేవ చేద్దాం. భవిష్యత్ విశాఖపట్టణం కార్పొరేషన్‌లో కూటమి విజయకేతనం ఎగురవేయాలి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వైకాపాకు చెందిన కార్పొరేటర్లు ఇతర పార్టీల్లోకి జారుకుంటుండటంతో జిల్లాకు చెందిన వైకాపా నేతలు షాక్‌కు గురవుతున్నారు. పైగా, గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.