Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ ట్రాజెడీ-కేజీహెచ్‌‌లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు.. కళ్లు కనబడక బావిలో పడి..?

Advertiesment
Vizag
, గురువారం, 7 మే 2020 (09:26 IST)
Vizag
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీగా గ్యాస్ లీకైన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతి చెందారని.. సుమారు 5వేల మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. పాలిమర్స్‌ బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ  విషవాయువు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
మరోవైపు వెంకటాపురంలో పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టూ ఉన్న చెట్లు మాడిపోయాయి. మరోవైపు సహాయక చర్యలు అందించడానికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థత గురయ్యారు. వారిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
 
అంతేగాకుండా.. ఘటనను పరిశీలించడానికి వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు వెల్లడించారు.
 
మరోవైపు విశాఖ సమీపంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ దుర్ఘటన బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సహాయక చర్యలు వేంగవంతం చేయాలని, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులకు అత్యున్నత వైద్య సహాయం అందించాలని కోరారు.
 
విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్యాస్ లీక్‌ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్ ను అడిగి ఆయన తెలుసుకున్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జగన్ వైజాగ్ వెళ్లనున్నారు.
 
అలాగే ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడి రసాయనాలు పీల్చుకుని అస్వస్థతకు గురై పలువురు మృతి చెందటం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు లోకేష్ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పార్టీశ్రేణులకు లోకేష్ పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాస్ లీక్ ప్రమాదంతో విశాఖలో పిట్టల్లా రాలిపోతున్నారు .. 8కి పెరిగిన మృతులు