Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖలో డేంజర్ బెల్స్... గ్యాస్ లీక్.. పెరుగుతున్న మృతులు - వేలాది మంది అస్వస్థత

విశాఖలో డేంజర్ బెల్స్... గ్యాస్ లీక్.. పెరుగుతున్న మృతులు - వేలాది మంది అస్వస్థత
, గురువారం, 7 మే 2020 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. స్థానిక గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సంభవించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు, ఫ్యాక్టరీ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. 
 
అయితే ఈ రసాయన వాయువు లీక్‌ కావడంతో విశాఖ పట్టణం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రసాయన వాయువు ప్రభావంతో ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, ఐదువేల మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వందల సంఖ్యలో బాధితులను పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 
 
సాయంత్రానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయువు ప్రభావంతో మనషులే కాదు.. మూగ జీవాలు కూడా బలైపోతున్నాయి. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని ఆవులు, దూడలు విగతజీవులుగా పడిపోయాయి. అక్కడున్న చెట్లు మాడిపోయాయి. 
 
రసాయన వాయువు లీక్‌ అయిందన్న విషయం తెలుసుకున్న ఆర్‌.ఆర్‌. వెంకటాపురం గ్రామస్తులు గృహాల్లోనే ఉండిపోయారు. అక్కడ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇండ్లలోనే చిక్కుకున్న వారి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
వాయువు ప్రభావంతో గంగరాజు అనే వ్యక్తికి కళ్లు కనబడకపోవడంతో.. బావిలో పడి చనిపోయాడు. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా గోపాలపట్నంలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో కెమెకల్ గ్యాస్ లీక్ ... ముగ్గురు మృతి - 200 మందికి అస్వస్థత