సిపిఎం, సిపిఐ పార్టీలకు సిగ్గులేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. జల వివాదంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలన్న ఆ పార్టీల నేతలు... ఇప్పుడు జోక్యం చేసుకుంటే తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారని అన్నారు.
విజయవాడలోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కమ్యూనిస్టులకు నీతి, ఒక అజెండా లేదన్నారు. సిపిఎం, సిపిఐ తెలంగాణాకు వ్యతిరేకమా? ఎపికి అనుకూలమా ప్రజలకు చెప్పాలన్నారు. సిపిఐ, సిపిఎం టిఆర్ ఎస్ పార్టీకి తొత్తులని విమర్శించారు.
ఏపీలో 26 నెలల్లో ఒక్క కొత్త ఇల్లు కట్టని వైసీపీ ప్రభుత్వం, 2022 కల్లా 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెపుతోందని విష్ణు వర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తి అయిన ఇళ్ళు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కంట్రాక్టర్ల కు బిల్లులు ఇవ్వలేకనే పేదల ఇళ్ళ బదలాయించడం లేదన్నారు.
అర్బన్ హౌసింగ్ అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ ఎందుకు జరపలేదని? అన్నింటిలో విచారణ అంటున్న వైసీపీ హౌసింగ్ పై ఎందుకు వెనక్కి తగ్గుతుందని ప్రశ్నించారు. గత మంత్రి నారాయణ తో వైసీపీ ప్రభుత్వం అంతా సెట్ చేసుకుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నాని ధాన్యానికి సంబంధించి కేంద్రం నిధులివ్వలేదని అంటున్నారని, మరి ఇళ్లకు ఇచ్చిన డబ్బులు ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రులే మిల్లులను నడుపుతున్నారు కాబట్టి ధాన్యం డబ్బులు వేయడం లేదని అనిపిస్తోందన్నారు.