Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై పూర్తి విచారణకు బాబు డిమాండ్.. సీఎం జగన్ ఓకే

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై పూర్తి విచారణకు బాబు డిమాండ్.. సీఎం జగన్ ఓకే
, ఆదివారం, 9 ఆగస్టు 2020 (11:16 IST)
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ చికిత్సా కేంద్రంలో ఆదివారం వేకువజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. దీనిపై పలువురు సినీ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 
 
మఖ్యంగా, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని ఆయన అన్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
విజయవాడ అగ్నిప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం గురించి తెలుసుకుని షాకయ్యానని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
'విజయవాడ కొవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. ఈ ఘటన పై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను' అని కేశినేని నాని పేర్కొన్నారు.  
 
'విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరగడం తీవ్ర దిగ్భ్రాంతికరం. ప్రమాదంలో పలువురు కరోనా రోగులు మృతి చెందడం బాధాకరం. మృతుల  కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి' అని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు.
 
కాగా, ఈ అగ్నిప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి వివారణకు ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
 
కాగా, అగ్ని ప్రమాదంపై సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోను చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోటల్‌ను ప్రైవేటు ఆసుపత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని మోడీకి సీఎం చెప్పారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని ప్రధానికి వివరించారు. దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని ఆయన అన్నారు.
 
కాగా, రమేశ్ ఆసుపత్రి లీజుకు తీసుకున్న ఆ హోటల్లో 50 మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కంప్యూటర్ రూంలో ఏర్పడిన షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంపై వెంకయ్య - మోడీ సంతాపం