ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఆదివారం వేకువజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
'విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నానని వివరించారు.
అలాగే, ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, 'విజయవాడలోని కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యల్లో చురుగ్గా ఉన్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, కొవిడ్-19 చికిత్సా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకుని వచ్చిన తరువాత, లోనికి వెళ్లిన సహాయక సిబ్బంది ఊపిరాడక మరణించిన వారిని గుర్తించారు.
కాగా, తొలుత గ్రౌండ్ ఫ్లోర్, ఆపై తొలి అంతస్తులో అంటుకున్న మంటలు, పై అంతస్తులకు వ్యాపించాయి. తొలి అంతస్తు నుంచి కేకలు వేస్తూ, నలుగురు వ్యక్తులు కిందకు దూకారని తెలుస్తోంది.
సహాయక బృందాలు, భవంతి అద్దాలను పగులగొట్టి మరికొందరిని నిచ్చెనల సాయంతో కిందకు తీసుకుని వచ్చారు. బాధితులను మెట్ల మార్గం ద్వారా తీసుకు వచ్చేందుకు వీలు పడలేదని వెల్లడించిన నగర సీపీ శ్రీనివాసులు, ఇప్పటికే బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించామని అన్నారు.