తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చావుతప్పి కన్నులొట్టబోయినంత పని అయ్యిందని వైసీఏ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఇస్తున్న తీర్పుతో టీడీపీ గుర్తు అయిన సైకిల్ ముందు చక్రం ఊడిపోయిందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలు వదిలేసిన సైకిల్ రెండో చక్రాన్ని కూడా పీకేసీ చంద్రబాబు పీడను త్వరగా వదిలించుకోవాలని ఏపీ ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నారని ట్విట్టర్లో విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. మరోవైపు ఢిల్లీలో మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు జరుగబోతున్న ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలను టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నా కేంద్రం చూస్తూ కూర్చుంటోందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నా ఆయన పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని విజయసాయిరెడ్డి నిలదీశారు.