టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. 'మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం మూడు గంటల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడట.
సైబరాబాద్ ఎస్వోటి పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళితే 23 తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబై చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?' అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆయన కోసం ఎస్వోటీ పోలీసులు గాలిస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఒకవేళ అమరావతిలో దాక్కుంటే ఈ నెల 23 తర్వాత దొరికిపోతామన్న ఉద్దేశంతో కర్ణాటక మీదుగా ముంబై చేరుకున్నట్లు తనకు తెలసిందన్నారు. తనను ఎవరూ టచ్ చేయలేరని బీరాలు పలికిన ఆయన ప్రస్తుతం పరారీలో ఎందుకు ఉన్నారని అడిగారు.
అలాగే తీవ్రమైన కరవుతో అనంతపురంలో మరణ మృదంగం మోగుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కరవు కారణంగా వేలాది కుటుంబాలు పక్క రాష్ట్రం కర్ణాటకకు వలస పోతున్నాయన్నారు.
చివరికి పశువులు, గొర్రెలకు మేత కూడా దొరక్కపోవడంతో వాటిని సైతం పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఇలాంటి పరిస్థితులు ఉంటే మరోవైపు రెయిన్ గన్లు, నీటి గలగలలు, కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం అని ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.