రాజ్యాంగ వ్యవస్థలపట్ల.. వ్యవస్థలోని వ్యక్తుల పట్ల వైసిపి నాయకులు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు ఏపీ బిజెపి కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం దర్సించుకున్నారు విష్ణువర్థన్ రెడ్డి. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఏపీ ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇంత దిగజారి వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.
అభివృద్ధి కంటే వివాదాలకు, రాజకీయ అస్థిరతకు అమరావతి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు పనిగట్టుకొని చులకన చేస్తున్నారన్నారు. సంచలనం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయడం, వ్యాఖ్యలు చేయడం సబబు కాదని..
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడం రాష్ట్రానికి నష్టం కలిగించేవి అని అన్నారు. రెండవ ప్రధమ పౌరుడి పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్పందించక పోవడం శోచనీయమన్నారు.
పార్లమెంట్ సాంప్రదాయాలకు, రాజ్యాంగానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. లేకుంటే చరిత్రహీనులుగా మిగులుతారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఎక్కడకి తరలి వెళ్ళదన్నారు. ఎలా నిలుపుకోవాలి అనే ఆలోచనకంటే... ఎలా రాజకీయం చేయాలి అనే ధోరణిలో పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తరలి వెళ్లకుండా, ఉద్యోగుల భద్రత కల్పించే బాధ్యత తమదేనన్నారు. సోము వీర్రాజు ఆధ్వర్యంలో బృందం కలసి పీఎం మోదీతో కలసి విశాఖ ఉక్కు పరిశ్రమ తరలివెళ్లకుండా చూస్తుందన్నారు.