మా అల్లుడు, సినీ హీరో తారకరత్న ప్రాణాలు కాపాడిన సినీ హీరో బాలకృష్ణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకులోనై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను బుధవారం విజయసాయి రెడ్డి పరామర్శించారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆస్పత్రి సిబ్బంది మంచి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలన్నీ బాగున్నాయని, మెడకు సంబంధించిన చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకుంటారని చెప్పారు. తారకరత్న అనారోగ్యానికి గురైన రోజు నుంచి దగ్గరుండి ఆయన బాగోగులు చూసుకుంటున్న బాలకృష్ణకు కృతజ్ఞతలు అని చెప్పారు. 
	 
	కాగా, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డికి సమీప బంధువు. విజయసాయి రెడ్డి భార్య సౌందర్య పెద్ద చెల్లి కుమార్తె. ఆ విధంగా విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు వరుస అవుతారు. దీంతో ఆయన బెంగుళూరుకు వెళ్లి తారకరత్నను చూసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.