ఒంగోలు వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతమైంది. ఈ మహానాడుకు అంచనాలకు మించి తరలివచ్చారు. దీంతో టీడీపీ నేతల సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి. ఈ జన సునామీకి కారణం అధికార వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమంటూ రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పసుపు పండగు విజయవంతం కావడంతో గత మూడేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్న నేతలు తిరిగి పార్టీ చెంతకు చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి వారిలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. గత ఎన్నికల్లో వైకాపా గెలిచిన తర్వాత టీడీపీకి దూరమయ్యారు. టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పైగా, జగన్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం కూడా సాగింది. కానీ, ఆయన వైకాపాలో చేరలేదు. అయితే, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు.
ఈ క్రమంలో తాజాగా హనుమాన్ జంక్షన్ వద్ద క్రికెట్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి వంశీ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎపుడూ తెలుగుదేశం పార్టీని విమర్శించలేదన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదన్నారు. టీడీపీ చెడ్డదని తాను ఎపుడూ అనలేదని స్పష్టం చేశారు. కానీ, లోకేశ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత టీడీపీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే విమర్శించానని వివరణ ఇచ్చారు.