ఆ ఇద్దరూ హేమా హేమీలు... రాయకీయ కురువృద్ధులు... ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు, ఉమ్మడిగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ కు ఒకరు హోం మంత్రిగా పనిచేస్తే, మరొకరు వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఇపుడు ఆ కురువృద్ధులిద్దరూ ఒక చోట సమావేశం కావడం... నిజంగానే రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి కరమైన ఘటనే. వారికి తోడు నవ యువ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తోడవడం...ఇంకా రక్తిగట్టే కలయిక ఇది.
ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావుని, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాధ్రిశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. వారి మధ్య మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు కూడా జతకలిశారు. శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రైతు సంఘాల నాయకులు వై. కేశవరావుతో కలిసి వచ్చిన వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఐతవరంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదుని కలిశారు. ఆయన మర్యాదపూర్వకంగా వడ్డేని తమ ఇంటికి స్వాగతించారు.
ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, మాజీ హోమ్ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడే కావడంతో ఆయన కూడా ఇద్దరు హేమాహేమీల మధ్య సరదాగా కూర్చున్నారు. ఇక వసంత, వడ్డే తమ సమకాలీన రాజకీయాలపై కాసేపు ముచ్చటించారు. నాడు హోం మంత్రిగా మీరు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపారని వసంతను వడ్డే శో్భనాద్రిశ్వరరావు అభినందిస్తే, వ్యవసాయ శాఖలో తనదైన ముద్ర వేశారని వడ్డే ని వసంత అభినందించారు.
ఇప్పటి రాజకీయాలు చాలా మారిపోయాయని ఇద్దరూ చిట్ చాట్ చేశారు. ఇంతలో యువ నేత వసంత కృష్ణప్రసాద్ అందుకుని, అంతా బాగానే ఉందని, ఇపుడున్న పరిస్థితులు ఇవని వంత పలికారు. ఇద్దరు కురువృద్ధులు గతంలో తెలుగుదేశంలోనే పెద్ద నాయకులుగా ఉండటం విశేషం. అప్పట్లో ఎన్టీయార్ సీఎంగా నడిచిన ప్రతిష్ఠాత్మకంగా సాగిన రాజకీయాలను ఇరు నేతలు నెమరు వేసుకున్నారు. వసంత తనయుడు కృష్ణ ప్రసాద్ యువ నేతగా రాజకీయాల్లో మరింత రాణించాలని వడ్డే శోభనాద్రిశ్వరరావు ఆశీర్వదించారు.