Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు వరకు పొడిగింపు?

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు వరకు పొడిగింపు?
, మంగళవారం, 29 అక్టోబరు 2019 (08:35 IST)
ఇటీవలే విశాఖపట్టణం - విజయవాడ - విశాఖపట్టణం మధ్యన ప్రవేశపెట్టిన ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ని గుంటూరు వరకు పొడిగించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ఈ రైలుకు విజయవాడలో ఆక్యుపెన్సీ శాతం తక్కువగా ఉండటం, అక్కడ ప్లాట్‌ఫారం కొరతతో గుంటూరుకు పొడిగించేందుకు ఆ డివిజన్‌ అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి ఇటీవలే గుంటూరు రైల్వే డివిజన్‌కు లేఖ అందింది.

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరులో టైమింగ్స్‌ ఇవ్వాల్సిందిగా జోనల్‌ అధికారులు కోరగా డివిజనల్‌ ఆపరేషనల్‌ అధికారులు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని టైమింగ్స్‌ వచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన రైల్వేబోర్డుకు వెళ్లింది. దీనికి అతిత్వరలోనే బోర్డు పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లుగా రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు నెలల క్రితం పట్టాల మీదకు వచ్చింది. నెంబరు. 22701 విశాఖపట్టణం - విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ గురు, ఆదివారంలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో వేకువజామున 5.45 గంటలకు బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదగా ఉదయం 11.15కి విజయవాడకు వస్తుంది.

అలానే నెంబరు. 22702 విజయవాడ - విశాఖపట్టణం ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆయా రోజుల్లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్టణం చేరుకొంటుంది. మొత్తం 10 ఏసీ చైర్‌కార్‌ బోగీలతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. జనరల్‌ కోటాలో 888 టిక్కెట్‌లున్నాయి. ఇవికాక తత్కాల్‌ కోటాలో మరో 120 వరకు ఏసీ ఛైర్‌కార్‌ సీట్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే విశాఖపట్టణ - విజయవాడ మధ్యన పలు రైళ్లు రాకపోకలు సాగిస్తోండటం, వాటితో పోల్చితే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్‌ ధర కాస్త పెచ్చు కావడంతో నిత్యం ఆశించిన విధంగా టిక్కెట్‌లు బుకింగ్‌ కావడం లేదు.

600లకు పైగా టిక్కెట్‌లు మిగిలిపోతుండటంతో వాటిని కరెంటు బుకింగ్‌లోకి తీసుకొస్తున్నారు. అయినప్పటికీ స్పందన ఉండటం లేదు. మరోవైపు ఉదయం వచ్చిన రైలుని సాయంత్రం వరకు విజయవాడ రైల్వేస్టేషన్‌/స్టేబుల్‌లేన్‌లో పెట్టడం కష్టం అవుతుండటంతో తొలుత ఈ రైలుని గుంటూరు వరకు పొడిగించేందుకు ఆసక్తి కనబరచని విజయవాడ డివిజన్‌ అధికారులు వారంతట వారే గుంటూరుకు పొడిగిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
 
దీంతో దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ అధికారులు గుంటూరు డివిజన్‌ అధికారులను ఆసక్తి కోరడంతో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ని విజయవాడలో 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరుకు చేరుకొంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలానే గుంటూరులో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి విజయవాడకు 5.15 గంటలకు అందజేస్తామని చెప్పారు.

అక్కడి నుంచి ప్రస్తుతం నడుస్తున్న టైంటేబుల్‌లోనే రైలు విశాఖపట్టణం వెళ్లేలా చేయొచ్చన్నారు. గుంటూరులో మధ్యాహ్నం వేళ ప్లాట్‌ఫాంలు ఖాళీగానే ఉంటోన్నాయి. కేవలం 10 భోగీలతోనే ఈ రైలు నడుస్తోన్నందున ఐదో నెంబరు ప్లాట్‌ఫాంని కేటాయించొచ్చని భావిస్తోన్నారు.

ఈ ప్రతిపాదనకు రైల్వేబోర్డు నుంచి త్వరలోనే క్లియరెన్స్‌ వస్తుందని అంతా ఆశిస్తున్నారు. దీని వలన విశాఖపట్టణంకు సాయంత్రం వేళ గుంటూరు నుంచి కొత్తగా ఒక రైలు అందుబాటులోకి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3న అల్పపీడనం...కోస్తాలో తేలికపాటి వర్షాలు