శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాలు ఏర్పాటు, అభివృద్ధి చేసేందుకు రూ.13 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.
శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు, అదే విధంగా తిరుపతి శిల్పారామాల అభివృద్ధితో పాటు పలు నిర్మాణాల కోసం రూ.10 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు.
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టేలా చేస్తున్నామని మంత్రి విడుదల చేసిన ప్రకటన లో తెలియచేశారు. శిల్పారామం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.
తిరుపతిలోని శిల్పారామంలో పార్క్ కోసం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి చెంసేందుకు రూ.10 కోట్ల వ్యయంతో పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి శోభ తీసుకొచ్చి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఎంట్రన్స్ ప్లాజా, ఆర్చ్, విజిటర్స్ గ్యాలరీ, ఫెసిలిటీ సెంటర్, త్రాగు నీరు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.
స్టాల్స్, ఓపెన్ గ్రౌండ్, శిక్షణ కోసం ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ గ్రామ నిర్మాణం , శిల్పకారుల కేంద్రం, సావనీర్ షాపుతో ఎంపోరియం, ఫుడ్ కోర్టుల నిర్మాణం, టాయిలెట్ బ్లాక్స్ పునరుద్ధరణ, ఓపెన్ ఎయిర్ థియేటర్. ల్యాండ్ స్కేపింగ్, జల మార్గాలు, విద్యుత్ పనులు, ప్లంబింగ్ , పారిశుద్ధ్య పనులతో శిల్పారామం ప్రాంగణాలను మరింత అద్భుతంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.
విశాఖపట్నంలోని శిల్పారామాన్ని రూ.10.92 కోట్లతో అభివృద్ధి కోసం ప్రతిపాదనలను పంపామన్నారు. ప్రతిపాదనలపై మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తూ నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ అనుమతుల కోసం పంపించడం జరిగిందని, త్వరలో మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
శిల్పారామల్లోకి మంగళవారం నుంచి పర్యాటకులను అనుమతించడం జరుగుతుందని, ఐతే ఫిల్మ్స్ ప్రదర్శనలు, వినోద క్రీడలకు అనుమతిలేదని పేర్కొన్నారు.