Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణపట్నంలో పాజిటివ్ కేసులు : ఆనందయ్య మందుపై అనుమానం?

కృష్ణపట్నంలో పాజిటివ్ కేసులు : ఆనందయ్య మందుపై అనుమానం?
, సోమవారం, 31 మే 2021 (08:06 IST)
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో నిన్న రెండు కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 27 మందిలో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. వైద్యాధికారులు ఆదివారం కృష్ణపట్నంలో అత్యవసరంగా ముగ్గురికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. 
 
ఫలితాల్లో ఇద్దరికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అలాగే, మరో 27 మంది స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్యాధికారిణి ప్రవల్లిక తెలిపారు. స్వల్ప లక్షణాలున్న వారి నమూనాలను ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం జిల్లా కేంద్రానికి పంపినట్టు వివరించారు. గ్రామంలో కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో మరో రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, ఈ గ్రామానికి చెందిన నాటు మందు వైద్యుడు బొనిగి ఆనందయ్య మందుకు అనుమతిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అనుమతిస్తుందా..? అని కోట్లాది మంది ప్రజలు మందుకోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 21న ఆగిపోయిన మందు పంపిణీపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. 
 
ఈ గ్రామ ప్రజలంతా ఆనందయ్య మందును తీసుకున్నారు. కానీ, ఈ గ్రామంలో కొత్తగా పాజిటివ్ కేసులు బయటపడటంతో ఇపుడు ఆనందయ్య మందుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. 
 
మరోవైపు.. ఆనందయ్య ఇంకా కృష్ణపట్నం గోపాలపురంలోని కేపీఎస్ఎస్పీఎల్ అకాడమీలోనే ఉండటం.. ఆయన చుట్టూ పోలీసులు వలయంలా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆనందయ్యను రహస్యప్రాంతానికి తరలించడం వెనుక ఇతర కారణాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
ఆనందయ్య ఊళ్లో ఉంటే అధిక సంఖ్యలో ప్రజలు వస్తారని, భద్రతా పరంగానూ ఇబ్బందులు ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నా, అసలు కారణాలు వేరే ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్దల కోసం పెద్ద ఎత్తున మందు తయారీ చేస్తూనే ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పొడంగింపు.. మరో కీలక నిర్ణయం కూడా..