Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనసేనపై రెండు పార్టీల కుతంత్రాలు: నాదెండ్ల మనోహర్

జనసేనపై రెండు పార్టీల కుతంత్రాలు: నాదెండ్ల మనోహర్
, శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:28 IST)
ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపుతుందనే నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉందని, లాక్‌డౌన్‌ కాలంలో భౌతిక దూరం పాటిస్తూనే డిజిటల్‌ సోషలైజేషన్‌ దిశగా మనం వెళ్తున్నామంటే దానికి కారణం సాంకేతికతేనని జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

కరోనా కష్టకాలంలో భవిష్యత్తు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లదేనని, టెక్నాలజీ ద్వారా రాజకీయాల్లో భారీ మార్పు తీసుకురావచ్చు అన్నారు. జనసేన పార్టీ బలోపేతం - దేశాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర అనే అంశంపై  బెంగళూరు ఐటీ టీం సభ్యులు నాదెండ్ల మనోహర్‌తో వెబ్‌నార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ ఇంఛార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఈ వెబినార్‌కు నేతృత్వం వహించారు.

బెంగళూరు ఐటీ టీం తరఫున పెన్నమరెడ్డి నాగబాబు, పసుపర్తి కిషోర్ కుమార్, చిత్తూరు శ్రీనివాసులు, శివ మేదండ్రవులు కో ఆర్డినేట్ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “ప్రజా గొంతుకై నిలబడాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని స్థాపించిన జనసేన పార్టీని ఆదిలోనే తొక్కేయాలని రెండు బలమైన పార్టీలు ప్రయత్నించాయి. సంబంధం లేకపోయినా ఎన్నికల సమయంలో ఒక పార్టీకి బీ-టీమ్ అంటూ విష ప్రచారం చేశాయి.

కొంతమందిని పార్టీలోకి పంపించి ఎన్నికల తర్వాత బయటకు వచ్చి పార్టీపై బురద జల్లే ప్రయత్నం కూడా చేశాయి. అయితే నిస్వార్ధం, నిబద్ధతగా పని చేసే జన సైనికులు, యువత వల్ల ఆ కుతంత్రం విఫలమయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీ ఈ రోజు బలంగా నిలబడింది అంటే దానికి ప్రధానం కారణం యువతే. 

వేడుకలకు దూరంగా... కరోనా బాధితులకు అండగా అంటూ ప్రారంభమైన ఆక్సిజన్ సిలిండర్ల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని 13 జిల్లాలకు రెండు చొప్పున 26 ఇవ్వాలని ముందుగా భావించాం. అయితే జనసేన నాయకులు, కార్యకర్తలు, ఎన్.ఆర్.ఐ విభాగం, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న జనసైనికులు, గ్రేటర్ హైదరాబాద్ టీమ్ సహకారంతో 26 కాస్త 640 సిలిండర్లకు చేరింది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చూపించిన సేవామార్గంలో నడవడానికి ఇంతమంది యువత ముందుకు వచ్చారు. ఇది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. 
 
కెరీర్‌గా తీసుకుంటే మార్పు తథ్యం... 
ప్రస్తుత రాజకీయాలు వ్యాపారమమ‌య్యాయి. కోట్లు ఉన్నవాడికే సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అలాంటివారు గెలిచాక పెట్టిన పెట్టుబడి సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో వ్యవస్థల్లో అవినీతి పేరుకుపోతుంది. ఇప్పటికీ రాజస్థాన్, బీహార్ వంటి ప్రాంతాల్లో ఎంపీ సీటుకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు, ఎమ్మెల్యే స్థానానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తారు. మన దగ్గర మాత్రం ఒక్కొక్క ఎంపీ సీటుకు కోట్లు కుమ్మరిస్తున్నారు.

అందుకు భిన్నంగా జనసేన పార్టీ  టికెట్ ఇచ్చేటప్పుడు ఎంత పెట్టగలడు అని చూడకుండా పాతికేళ్లు పార్టీతో ప్రయాణం చేయగలడా లేదా అని ఆలోచించి టికెట్ ఇచ్చాం. అలా ఆలోచించాం కాబట్టే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక కండక్టర్ కొడుకు, ఒక వ్యవసాయ కూలీ కొడుకు, సామాన్యులు పోటీ చేయగలిగారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే కొత్త రక్తం రావాలి.

రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా యువత ఎంచుకోవాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే, ఒక మంచి పార్టీకి పట్టం కడితే వ్యవస్థలో మార్పు వస్తుందని ప్రజల్లో అవగాహన రావాలి. అప్పుడే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుంది. 
 
పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా పార్టీ ఆఫీసు...
రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు రూపొందించి ముందుకు వెళతాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి కార్యాలయంలో అవసరమైన సిబ్బందితో పాటు  సోషల్ మీడియా ఇంఛార్జులను నియమిస్తాం. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఇవి నడిచేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని” తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగనన్న మద్యం వ్యాపార పథకం అమల్లోకి తెచ్చాడు: వంగలపూడి అనిత