వేడుకలకు దూరంగా.. కరోనా బాధితులకు అండగా అంటూ ప్రారంభమైన జనసేన పార్టీ జనసేవా కార్యక్రమం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ప్రాణం పోయిన తర్వాత రూ.15 వేలు ఇస్తే, మేం ప్రాణాలు పోసేందుకు రూ.10 వేలు వ్యయంతో ఆక్సిజన్ సిలెండర్లు ఇస్తాం అని జనసేన నాయకులు, శ్రేణులు, అభిమానులు ముందుకు వచ్చారు.
ఆగస్ట్ 27న మొదటి విడతగా 341 ఆక్సిజన్ సిలిండర్లను అన్ని జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు, కోవిడ్ కేంద్రాలకు అందించారు. ఈ ప్రాణవాయువు అందించే కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా కొనసాగించారు. కార్యక్రమానికి స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలతో పాటు ఎన్.ఆర్.ఐ. విభాగం, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న జనసైనికులు తమవంతు సహకారం అందించారు.
సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని పలు నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ నగరంలోను అందించారు. రెండో విడతగా 280 ఆక్సిజన్ సిలిండర్, నార్మల్ వెంటిలేటర్ తో కూడిన యూనిట్లు తమ తమ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రులకు అందచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ రోగులకు ప్రాణ వాయువు అందించే ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంతో ముందు తీసుకువెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు.
పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా రెండో విడతగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 91 ఆక్సిజన్ సిలిండర్ యూనిట్లు ఆయా ప్రాంతాల్లోని కోవిడ్ ఆసుపత్రులకు అందచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 45 యూనిట్లు, విశాఖలో 31 యూనిట్లు, గుంటూరులో 15, కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో 6 యూనిట్ల చొప్పున, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో 5 చొప్పున మెడికల్ సిబ్బందికి జనసేన నేతలు అందించారు.
హైదరాబాద్ నగరంలో 70 యూనిట్లను జనసేన గ్రేటర్ హైదరాబాద్ నాయకులు, కార్యకర్తలు సమకూర్చారు. ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో ఒక్క కొవిడ్ రోగి ప్రాణం కూడా పోరాదు అన్న లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల కొరత కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కార్యక్రమానికి జనసేన శ్రేణులు రూపం ఇచ్చాయి.