తెలుగు టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్యకు ముందు ప్రియుడు సూర్య తేజతో అనేకసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంభాషణ ఆధారంగా వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఆమె వాడిన ఫోన్లలో శాంసంగ్ ఫోన్ లాక్ ఓపెన్ చేసిన పోలీసులు.. ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐఫోన్‌ను అన్‌లాక్ చేస్తే ఏమైనా సమాచారం లభిస్తుందేమోనని భావిస్తున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా నాగఝాన్సీ, సూర్యల మధ్య ప్రేమాయణం కొనసాగిందని పోలీసులు చెప్తున్నారు.
కాగా.. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీలో తన నివాసంలో ఝాన్సీ మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఝాన్సీ బలవన్మరణానికి ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది.
సూర్య అలియాస్ నానితో పరిచయం అయిన తర్వాత ఝాన్సీ సీరియల్స్ మానేసిందని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. వివాహం చేసుకోమంటే అతడు ముఖం చాటేసినట్టు చెప్పుకొచ్చారు. సూర్య తనను మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు.