ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎనిమిదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నారాయణ రావు (62) చావడమే కరెక్ట్ అని ఆయన కుటుంబ సభ్యులు అన్నారు. అలాంటివాడి శవం కూడా తమకు వద్దని వారు పోలీసులకు తేల్చి చెప్పారు. పైగా నారాయణ రావు మృతదేహాన్ని పంచనామా చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు సంతకాలు చేయకపోవడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తూగో జిల్లా తుని బాలిక అత్యాచారం కేసులో నిందితుడైన నారాయణ రావు స్థానిక చెరువులో శవమై కనిపించిన విషయం తెల్సిందే. బాలికపై అత్యాచారం ఎంత సంచలనం సృష్టించిందో... నారాయణ రావు మృతి వార్త కూడా అంతే సంచలనంగా మారింది. అయితే, అతని మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టుకోవడం మాట అటుంచి... అలాంటి వాడు చావడమే కరెక్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై నిందితుడు కుమారుడు సురేశ్, కోడలు రాజేశ్వరిలు మాట్లాడుతూ, నారాయణ రావు చనిపోయారని పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. అతను చేసిన పనికి చావడమే సరైందని మేము భావిస్తున్నాం అని చెప్పారు. నిందితుడి కుమార్తె నాగలక్ష్మి కూడా ఇదే విధంగా స్పందించారు. అతను చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే అదుకే పోలీసులు అరెస్టు చేశారని తెలిసిన తర్వాత ఠాణాకు వైపు కూడా మేము కన్నెత్తి చూడలేదు అని చెప్పుకొచ్చింది.