Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై కోట్లలో పరువు నష్ట దావా.. ఎవరంటే?

తిరుమల తిరుపతి దేవస్థానంలో నోటీసుల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. టిటిడి ప్రతిష్టకు భంగం కలిగించే వారెవరినీ వదిలిపెట్టేది లేదని పాలకమండలి హెచ్చరించీ మరీ నోటీసులు పంపడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. టిటిడి పంపిన నోటీసులపై కొంత

రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై కోట్లలో పరువు నష్ట దావా.. ఎవరంటే?
, బుధవారం, 13 జూన్ 2018 (21:39 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో నోటీసుల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. టిటిడి ప్రతిష్టకు భంగం కలిగించే వారెవరినీ వదిలిపెట్టేది లేదని పాలకమండలి హెచ్చరించీ మరీ నోటీసులు పంపడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. టిటిడి పంపిన నోటీసులపై కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం శ్రీవారి ప్రతిష్ట దిగజారిన తరువాత ఆలస్యంగా స్పందించడంపై మండిపడుతున్నారు. టిటిడి పంపిన నోటీసుల్లో అసలేముంది. నోటీసులు అందుకున్న వారికి ఎలాంటి శిక్ష పడుతుంది.  
 
గత నెలరోజులుగా టిటిడి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోన్న విషయం తెలిసిందే. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులు పదవీ విరమణ చేసిన తరువాత శ్రీవారి ఆలయంలో జరుగుతున్న కైంకర్యాలపై ఆరోపణలు చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. రమణదీక్షితుల వ్యవహారంపై టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మొదట్లో స్పందించినా ఆ తరువాత వ్యవహారం మరింత ముదరడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిటిడి ఈఓ, టిటిడి ఛైర్మన్‌లను పిలిచి అమరావతిలో భేటీ కూడా అయ్యారు. శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించే వారినెవరినీ వదిలిపెట్టవద్దని హెచ్చరించారు కూడా. న్యాయపరమైన పోరాటం చేయాలే తప్ప రమణదీక్షితులులా మీరు కూడా ఎక్కడా మాట్లాడవద్దని సూచనలిచ్చి చంద్రబాబు పంపారు. దీంతో రెండవ టిటిడి పాలకమండలి సమావేశంలో టిటిడి వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకుంది పాలకమండలి.
 
టిటిడి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడేవారిని న్యాయపరంగా ఎదుర్కోవాలని, వారికి ముందుగా నోటీసులు పంపాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చాలా ఆలస్యంగా తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసిపి ఎంపి విజయసాయి రెడ్డిలకు నోటీసులను జారీ చేసింది టిటిడి. మీరు చేసిన ఆరోపణలను ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. పోస్టు ద్వారా నోటీసులను ఇద్దరికీ పంపించింది. శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రబద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదని, రాజకీయ కేంద్రంగా టిటిడిని మార్చేస్తున్నారని రమణదీక్షితులు ఆరోపిస్తే, శ్రీవారి ఆభరాలన్నీ కనిపించకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని, స్వామివారి ఆభరణాలన్నీ బాబు ఇంట్లోనే ఉన్నాయని, కొన్ని ఆభరణాలను నారా లోకేష్‌ విదేశాల్లో అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు ఎంపి విజయసాయిరెడ్డి. దీంతో టిటిడి వీరిద్దరికీ నోటీసులు పంపింది. 
 
రమణదీక్షితులు, విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసినప్పుడే టిటిడి స్పందించి ఉంటే టిటిడి ప్రతిష్టకు భంగం కలిగేది కాదంటున్నారు భక్తులు. ఆలస్యంగానైనా టిటిడి స్పందించినందుకు సంతోషపడుతున్నారు. అయితే టిటిడి నోటీసులు ఇవ్వడంకన్నా వారు చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటపడతాయంటున్నారు హిందూ ధార్మిక సంఘాలు. టిటిడి నోటీసులతో సరిపెట్టుకుంటుందా లేకుంటే భక్తుల్లో ఉన్న అనుమానాలు పోగొట్టే ప్రయత్నం చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. కాగా ఆరోపణలు చేసినవారిపై కోట్లలో పరువు నష్టం దావా వేయాలని తితిదే యోచన చేస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశాల్లో శ్రీవారి నగలను అమ్మేసిన నారా లోకేష్‌.. నిజమా? కాదా?