Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కచ్చులూరు బోటు వెలికితీత పనులు ప్రారంభం

కచ్చులూరు బోటు వెలికితీత పనులు ప్రారంభం
, సోమవారం, 30 సెప్టెంబరు 2019 (15:12 IST)
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పదిహేను రోజుల కిందట గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత పనులు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పనులను కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. బోటుకు వెలికితీతకు రూ.22.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యం బృందం రోప్‌, లంగర్లతో కచ్చలూరు వద్దకు చేరుకుంటున్నారు. దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌ నుంచి భారీగా సామగ్రిని ప్రమాద ప్రాంతానికి ప్రత్యేక బోటులో తరలిస్తున్నారు. కచ్చులూరు మందం అంటేనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. గోదావరిలో ఇక్కడ పెద్ద సుడిగుండాలు ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం అత్యంత క్లిష్టమైన చర్య. 
 
ఈ నేపథ్యంలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి నేతృతంలోని జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. సహాయక చర్యలు జరిగే సమయంలో తాళ్లు తెగి ఎదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రదేశానికి ఇతరులను రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. కాగా బోటు వెలికితీసే సమయంలో ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. 
 
ఆ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి 144 సెక్షన్‌ విధించారు. ధర్మాడి సత్యం నేతృత్వంలో 25 మంది మత్స్యకారులు, నిపుణులు వెలికితీతలో పాల్గొంటున్నారు. క్రేన్‌, ప్రొక్లెయిన్‌, బోటు, పంటు, 800 మీటర్ల వైర్‌ రోప్‌, రెండు లంగర్లు, మూడు లైలాండ్‌ రోప్‌లు, పది జాకీలు, ఇతర సామగ్రి ఉపయోగిస్తున్నారు.
 
కాగా, గోదావరిలో మునిగిన బోటు వెలికితీత ప్రక్రియను నది పైనుంచే చేపడతామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు 210 అడుగుల లోతులో ఉండటం వల్ల అక్కడికి ఎవరూ వెళ్లలేరని ఆయన వివరించారు. ఇప్పటికే బోటు ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని, వెలికితీత అత్యంత కష్టమైనా పలుసార్లు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 
 
బోటు మునిగిపోయిన ప్రాంతంలో ఒక బోటు, పంటు ఉంటాయి. దీనికి దాదాపు 700 అడుగుల దూరంలో ఒడ్డున క్రేన్‌, పొక్లెయిన్‌ ఉంచుతారు. నదిలోకి దిగకుండానే బోటు, పంటు మీద నుంచి లంగర్లు నీటిలోకి జారవిడిచి ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల గాలిస్తారు. లంగరుకు బోటు తగిలిన వెంటనే ఆ రోప్‌ను క్రేన్‌కు అనుసంధానించి బయటకు లాగడానికి ప్రయత్నిస్తారు. రెండు లంగర్లతో గాలింపు కొనసాగిస్తున్నారు.
 
గోదావరిలో ఈ ఘోర ప్రమాదం జరిగి 15 రోజులైనా గల్లంతైన వారిలో 15 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం బోటులో 77మంది ప్రయాణించగా, ప్రమాదం తర్వాత 26 మంది సురక్షితంగా బయట పడ్డారు. ఇప్పటివరకు 36 మృతదేహాలను గుర్తించారు.
 
రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీతకు చర్యలు చేపడుతుండడంతో తమవారి ఆచూకీ తెలుస్తుందేమోనన్న ఆత్రుత బాధితులందరిలోనూ వ్యక్తమవుతోంది. బోటు మునిగిపోయిన రోజు నుంచి దాదాపు 12 రోజులపాటు తమ వారి ఆచూకీ కోసం ఎదురు చూసిన బంధువులు చివరికి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో సర్కారీ మద్యం దుకాణాలు... మూడు కొంటే ఒకటి ఫ్రీ