తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారి తీసింది. 60కి పైగా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికీ 16 మంది ఆచూకీ లభించలేదు. అయితే బోటు డ్రైవర్లు ఆచూకీ కూడా లభించలేదు.
బోటు డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణలు చనిపోలేదనీ, వారు బతికే ఉన్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదాన్ని ముందే ఈ బోటు డ్రైవర్లు గమనించారని తెలుస్తోంది. అందుకే బోటు ప్రమాదానికి పది నిమిషాల ముందే వీరు కిందకు దూకేశారని బోటులో ప్రయాణిస్తూ ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు.
పడవ నడపడంలోను, ఈత కొట్టడంలోను వీరిద్దరూ నిష్ణాతులు. అలాంటివారు చనిపోయే అవకాశాలు తక్కువని.. ఇంతటి పెద్ద ప్రమాదం జరగడానికి తామే కారణమని తెలిస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో ఇద్దరు బోటు డ్రైవర్లు కనిపించకుండా తిరుగుతున్నారని తెలుస్తోంది. దీంతో పోలీసులు బోటు డ్రైవర్ల కుటుంబ సభ్యుల కాల్ డేటాను వెతికే పనిలో పడ్డారు. మరి నిజంగా ఈ డ్రైవర్లు బతికే వున్నారా లేదా అనేది కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.