తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఒంగోలుకు చేరుకోనున్నారు. ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మహానాడు ప్రారంభమయ్యే శుక్రవారం ఒంగోలుకు వస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన ఒక్క రోజు ముందుగానే ఒంగోలుకు చేరుకుంటున్నారు.
ఇదిలావుంటే, మహానాడు జరిగే ప్రాంగణం అయిన మండవవారిపాలె పొలాల్లో వారం రోజులుగా ముమ్మంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. దాదాపు మహానాడు ఏర్పాట్లు ఓ కొలిక్కిరాగా ఒంగోలు నగరంలోని ప్రధాన కూడళ్ళు, రహదారులు, పాత బైపాస్ రోడ్డు ప్రాంతాలు టీడీపీ తోరణాలు, జెండాలు, నేతల ఫ్లెక్సీలు, హోర్డింగులతో నిండిపోయాయి.
అలాగే, మహానాడు ప్రాంగణంలో ప్రతినిధుల సభ, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తుండగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం ఒంగోలు చేరుకున్నారు. రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి మహానాడు ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.