Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి రైతుల ఉద్యమాన్ని పండుగలా చేయాలని చంద్రబాబు ఎలా అంటాడు?: బొత్స ప్రశ్న

Advertiesment
అమరావతి రైతుల ఉద్యమాన్ని పండుగలా చేయాలని చంద్రబాబు ఎలా అంటాడు?: బొత్స ప్రశ్న
, శనివారం, 1 మే 2021 (09:35 IST)
కరోనా నేపథ్యంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి జూమ్‌ కాన్ఫెరెన్స్‌లు నిర్వహిస్తూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

అమరావతి పరిరక్షణ సమితి, కొందరు రాజకీయ పార్టీల నేతలతో చంద్రబాబు జూమ్‌ కాన్ఫెరెన్స్‌ నిర్వహించాడు. తన ఉపన్యాసంలో అమరావతి రైతులు 500 రోజుల పాటు చేసిన ఉద్యమాన్ని ఒక పండుగలా 35 దేశాల్లో జరుపుకున్నారని మాట్లాడటం విడ్డూరంగా వుంది. ఒకవైపు రైతులు బాధపడుతున్నారని చెబుతూ, మరోవైపు దానిని ఒక పండుగలా జరుపుకున్నారని మాట్లాడటం చంద్రబాబుకే చెల్లుతుంది. 
 
అసలు అమరావతిలో మీరు పెట్టిన పరిరక్షణ సమితి ఎవరి కోసం? చంద్రబాబు తన బినామీల ఆస్తులను పరిరక్షించుకునేందుకు కాదా? మా ప్రభుత్వం మొదటి నుంచి మూడు రాజధానుల ఏర్పాటుపై చాలా స్పష్టంగా వుంది. విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలుకు జ్యుడీషియల్‌ క్యాపిటల్, అమరావతికి శాసన రాజధాని ఉంటాయని, ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం మాకు ముఖ్యమని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అనేక సందర్భాల్లో చెప్పారు. అసెంబ్లీలో కూడా దీనిపై చట్టం చేశారు. ఇది మా విధానం. 
 
మా ప్రభుత్వ మూడు రాజధానుల విధానానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభించింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ఈ మూడు ప్రాంతాల ప్రజలు తమ ఓట్ల ద్వారా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు స్థానిక ఎన్నికల ప్రచారంలో విశాఖ, విజయవాడ, గుంటూరులో ప్రజలనుద్దేశించి మీకు పౌరుషం లేదా? సిగ్గు లేదా? అంటూ రెచ్చగొట్టారు. అయినా కూడా ప్రజలు విజ్ఞతతోనే తమ తీర్పు ఇచ్చారు. ఇంకా మా ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆడిపోసుకోవడం మానుకోలేదు. 
 
చంద్రబాబు తాను మాట్లాడిన ప్రతి దానికి తందానా అనే వారిని కుర్చోబెట్టుకుని, ఒక ప్రాంతానికి చెందిన వారి ప్రయోజనాలే పరమార్థంగా, అందులోనూ తన బినామీలకు ఎటువంటి నష్టం రాకూడదనే ధ్యేయంతో పని చేస్తున్నాడు. చంద్రబాబు ఈ సమాజం గురించి కాదు.. కేవల తన సామాజికవర్గం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఒక టెంట్‌ వేసి నలుగురిని కూర్చోబెట్టి, చంద్రబాబుకు జై అంటూ నినాదాలు చేయించి, దాన్ని ఉద్యమం అంటే ఎవరు అంగీకరిస్తారు?
 
రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి మా ప్రభుత్వం ఎంతో బాధ్యతతో వుంది. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ప్రకటించిన దానికన్నా ఎక్కువ కాలపరిమితికి కౌలు, పెన్షన్లు, పంటపరిహారం కూడా పెంచి ఇస్తున్నాం. అదికూడా సమయానికి అనుకూలంగా చెల్లిస్తున్నాం. మేం ఇచ్చిన మాట ప్రకారం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్‌లు ఇచ్చేందుకు సిద్దంగా ఉంటే.. కోర్టులలో సాంకేతికపరమైన అంశాలతో స్టేలు తీసుకువచ్చి చంద్రబాబు, ఆయన అనుయాయులు అడ్డుకుంటున్నారు. లేకపోతే ఈ పాటికే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్‌లు ఇచ్చి ఉండే వాళ్లం. 
 
హైదరాబాద్‌కు పరిమితమైన చంద్రబాబు ఈ రోజు జూమ్‌ కాన్ఫెరెన్స్‌ లో చెప్పినవన్నీ అవాస్తవాలు. 
ఈ కోవిడ్‌ సమయంలోనూ మేం రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్దితో అన్ని వర్గాల వారికీ, రైతులు, రైతుకూలీలు, సామాన్యులు, ఉద్యోగులకు అందరికీ ఏ విధంమైన ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం పని చేస్తున్నాం. కోవిడ్‌ పైన సమీక్షించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ.. అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు ప్రజా ప్రతినిధులతో సమయన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
 
కరోనా సంక్షోభంలోనూ డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, శానిటరీ, ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. ధైర్యంగా వారు కోవిడ్‌ పేషంట్లకు సేవలు అందిస్తున్నారు. కరోనా మీద యుద్దం చేస్తున్నాం. నిజంగా వారికి హ్యాట్సాప్‌. కానీ వారిని కూడా రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఉద్యోగులు పని చేయవద్దని అంటున్నాడు. జూమ్‌ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతున్న చంద్రబాబుకు అందుకు అవసరమైన కరెంట్‌ ఎలా వస్తోందని తెలియదా? ఉద్యోగులు పని చేయకపోతే తన జూమ్‌ కాన్ఫెరెన్స్‌ నిర్వహించే పరిస్థితి వుండేదా?  
 
ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అది ప్రభుత్వ బాధ్యత. వారం రోజుల కిందట రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు దొరకడం లేదనే విమర్శలతో దానిని కట్టడి చేశాం. ఇంకా సులువుగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వాక్సిన్‌ తెప్పించేందుకు, ఆక్సీజన్‌ కొరత లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. షట్‌డౌన్‌లో వున్న ఆక్సీజన్‌ ప్లాట్‌లను వినియోగంలోని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం.
 
ప్రతి 20 ఆస్పత్రులకు ఒక కోఆర్డినేటర్‌ను నియమించాం. ఎంబీబీఎస్‌ డాక్టర్లకు వాకిన్‌ ఇంటర్వ్యూలు పెట్టి వారిని ఆసుపత్రుల్లో నియమిస్తున్నాం. అవకాశం వున్నంత వరకు కేంద్రంతోనూ, ఫార్మా కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఏ విషయాన్ని అశ్రద్ద చేయడం లేదు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 
 
ఒకవైపు ప్రభుత్వం ప్రజల కోసం ఇలా పని చేస్తుంటే.. కొందరు టెంట్‌ వేసుకుని.. 500 రోజులంటూ.. దానికి పండుగ చేయాలంటున్నారు. పైగా దానికి చంద్రబాబు జూమ్‌ కాన్ఫరెన్స్‌. ఇంకా దానికి శాసనసభలో ప్రాతిని«థ్యం లేని పార్టీలు వచ్చి దానికి వత్తాసు పలకడం.. ఇదేనా ప్రతిపక్షంగా టిడిపి చేయాల్సి పని. ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా? ప్రజల రక్షణ పట్ల కొద్దిగైనా చిత్తశుద్ది ఉందా? 
 
కరోనాను జయించిన నాడే మాకు పండుగ. అటువంటి పరిస్థితిని తీసుకురావడానికే మా ప్రభుత్వం ప్రతిక్షణం పని చేస్తోంది. అందువల్లే దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఎపిలో మరణాలు తక్కువ. కరోనా పరీక్షలు ముమ్మరంగా చేస్తూ, వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తూ, యుద్దప్రాతిపాదికన ప్రభుత్వం పనిచేసుకుంటూ పోతోంది.  
 
చంద్రబాబు జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ సంక్షోభ  సమయంలోనూ ఆయన బుద్ది మారలేదు. భగవంతుడు ఆయనకు మంచి బుద్ది ఇవ్వలేదు. నాలుగు మంచి మాటలు చెప్పి, ప్రజల కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఏనాడు చెప్పడు, ఎంతసేపు ఆయన ఎజెండా తయారు చేస్తాడట, ఈ ప్రభుత్వం దానిని అమలు చేయాలని అంటాడు. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని చెప్పుకుంటాడు. నిజంగా చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ ఈనాడు ఈ స్థితిలో వుంటే 2014లో ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించారు. చంద్రబాబు ఆలోచించుకోవాలి. 
 
ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతే మన పనితీరుకు కొలమానం. జూమ్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పిందే చెప్పి, అబద్దాలను నిజాలుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఔటర్‌ రింగ్‌ రోడ్, పివి నర్సింహారావు ఫ్లైఓవర్‌ తానే నిర్మించానంటూ అబద్దాలు చెప్పుకుంటాడు. ఇప్పుడు అమరావతిలో తన బినామీలను రక్షించుకునే చర్యలే తప్ప, ఈ ప్రాంత రైతులను అభివృద్ధి చేసే ఆలోచన ఆయనకు లేదు. మాకు అమరావతి రైతుల పట్ల చిత్తశుద్ది వుంది. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మూడు ప్రాంతాలను మూడు విధాలుగా అభివృద్ధి చేయాలని, విధానపరమైన, రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్నారు.
 
కరోనా వల్ల సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసి కార్మికులు, మెడికల్, శానిటరీ ఉద్యోగులతో పాటు అన్ని రంగాల్లోనూ మరణాలు జరుగుతున్నాయి. చనిపోయిన వారి పట్ల సానుభూతి ఉంది. నేడు కరోనా మీద జరుగుతున్న యుద్దంలో ఉద్యోగుల పాత్ర కీలకం. అందుకే వారిని అభ్యర్థించాం. అందరం ధైర్యంగా ముందుకు సాగుదామని కోరాం. అందరం ఇళ్ళలో కూర్చుంటే ఈ విపత్తును ఎలా ఎదుర్కోగలం?
 
మీడియా ప్రతినిధులు కూడా ఎంతో ధైర్యంతో పని చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎప్పుడైనా వెనుకడుగు వేశామా? ఉద్యోగులు వీరోచితంగా ప్రజలకు సేవలు అందించారు. ఆ రకంగా పని చేస్తున్న ఉద్యోగులను అభినందిస్తున్నాం. మా కుటుంబాల్లోనూ ఉద్యోగస్తులు వున్నారు. వర్క్‌ ఫ్రం హోం కు కొన్ని పరిమితులు వున్నాయి. ఫీల్డ్‌లో చేయాల్సిన పనులను ఇంటి నుంచి చేయలేము. ఇవ్వన్నీ తెలిసి కూడా చంద్రబాబు ఏదో ఒకరకంగా ప్రభుత్వంపై బురద చల్లాలనే తత్వంతో మాట్లాడుతున్నాడు. 
 
45 ఏళ్ళకు పైబడిన వారికి కేంద్రం ఉచితంగా వాక్సిన్‌ ఇస్తోంది. అంత కంటే తక్కువ వయస్సు వున్న వారికి ఉచితంగా వాక్సిన్‌ ఇవ్వాలని సీఎం  నిర్ణయించారు. దానికి అనుగుణంగా వాక్సిన్‌ సరఫరా చేసే సంస్థలకు ఇండెంట్‌ పెట్టాం. వచ్చే వాక్సిన్‌లకు అనుగుణంగా వాక్సినేషన్‌ చేస్తాం. కరోనా టెస్ట్‌ ఫలితాలకు ఎక్కువ సమయం లేకుండా చూస్తున్నాం. గతంలో రోజుకు అయిదు వేలు లోపు ఫలితాలు ఇచ్చేవాళ్లం. క్రమంగా దానిని 35 వేల వరకు తీసుకువెళ్ళాం. తాజాగా రోజుకు 75 వేల వరకు పరీక్షా ఫలితాలను ఇస్తున్నాం. వచ్చే సోమవారం నుంచి ఏరోజుకారోజు పరీక్షల ఫలితాలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే ట్రూనాట్‌ టెస్ట్‌లు కూడా చేయడం ద్వారా బ్యాక్‌లాగ్‌ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు మారరా? కోవిడ్ ఆంక్షలను ధిక్కరిస్తున్న ప్రజలపై కర్నాటక పోలీసులు ఆగ్రహం