Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత - భానుడి దెబ్బకు 20 మంది మృతి

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయభానుడి ఉగ్రరూపానికి జనం అల్లాడి పోతున్నారు. వడగాల్పులకు విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలపై అంతా ఇంత

తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత - భానుడి దెబ్బకు 20 మంది మృతి
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (13:58 IST)
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయభానుడి ఉగ్రరూపానికి జనం అల్లాడి పోతున్నారు. వడగాల్పులకు విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలపై అంతా ఇంతాకాదు. 
 
హేవిళంబి నామ సంవత్సరం తనతో పాటు వడగాల్పులను తీసుకొచ్చింది. దాంతో మార్చి నెలాఖరు నుంచే భానుడు చండప్రచండ రూపం దాల్చాడు. ఎన్నడూ లేనివిధంగా కాంతి కిరణాలను ప్రసరింపచేస్తున్నాడు. సూర్యభగవానుడి ఉగ్రతాండవంతో జనం ఎండ వేడిమిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మండుతున్న ఎండలకు వడగాల్పులు కూడాతోడు కావటంతో అల్లాడిపోతున్నారు.
 
ఉదయం 9 గంటలు దాటితే రోడ్డెక్కేందుకు సాహసించలేక పోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు పన్నెండు దాటితే నిర్మానుష్యనంగా దర్శనమిస్తున్నాయి. గొడుగు నీడన కొందరు, ముసుగులు ధరించి మరికొందరు సూర్యరశ్మి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ కార్యాలయాల బాట పడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగి పోతుండటంతో ఉక్కపోతకు గురవుతున్నారు. పరీక్షాసమయం కావటంతో విధిలేక రోడ్డెక్కి వడదెబ్బ బారిన పడుతున్నామని వాపోతున్నారు. 
 
సూర్యతాపం నుంచి ఉపసమనం పొందేందుకు పండ్లరసాలు సేవిస్తున్నారు. చలువనిచ్చే పుచ్చకాయలు, చేరుకురసాలు, తాటి ముంజెలకు మంచి గిరాకీ పెరిగింది. ఇప్పుడే ఇలావుంటే మే, జూన్‌లలో పరిస్థితి ఎలావుంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. మరోపక్క భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి మొదలైపోయింది. గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీళ్లు చిక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి. నీటి ఎద్దడిపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్న సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. తాగునీటి సమస్య తలెత్తనీయవొద్దంటూ అధికారులకు హుకుం జారీ చేసింది. 
 
మరోవైపు... రాష్ట్రంలో ఇప్పటికే వడదెబ్బకు 20 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరికొందరు ఆసుపత్రుల పాలయ్యారు. గాలిలో తేమ, ఎల్నినో ప్రభావంతో మరో రెండు రోజులపాటు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ యేడాది ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందంటున్నారు. సో తస్మాత్ జాగ్రత్త. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లిని ఇంటి ముందు ఎర్రటి ఎండలోకి నెట్టేసిన రిటైర్డ్ హెడ్మాస్టర్... (Video)