వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ విమర్శలు గుప్పించారు. తాను నిర్మించిన సీతారామం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని.. తిరుపతిలో జరిగే అన్యాయాలను ఊహించలేమని, ఇప్పుడు అక్కడ జరగని పాపం లేదని అశ్వనీదత్ ఫైర్ అయ్యారు.
స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు.
గతంలో తిరుపతిలో ఆగమ శాస్త్రం ప్రకారం వెయ్యికాళ్ల మండపాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలగించారన్నారు. కానీ ఆ విషయంలో నాడు చినజీయర్ స్వామి.. చంద్రబాబును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఏపీలో బలవంతపు మత మార్పిడిలు జరుగుతుంటే బాబు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చినజీయర్ ఆ మధ్య జగన్ను దైవాంశ సంభూతుడని పొగిడిన మాటలు వినగానే తన కడుపు మండిపోయిందని అశ్వనీదత్ తెలిపారు.
సమ్మక్క- సారక్కను చినజీయర్ దేవతలు కాదనడం తనకు బాధ కలిగించిందన్నారు. సమ్మక్క-సారక్క అంటే తెలంగాణ ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందన్నారు.