తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. బాలికలపై వసతి గృహంలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా గత నాలుగేళ్ల పాటు ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బాలికపై జరిగిన అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బాలికపై దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. హాస్టల్ సూపరింటెండెంట్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
కడప జిల్లాకు చెందిన బాలిక 2012లో ఉన్నత విద్య కోసం తిరుపతిలోని షెల్టర్ హోంలో చేరింది. ఆమె తల్లి చనిపోగా, ఓ కేసులో తండ్రి జీవిత శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఆమెను వసతి గృహానికి తరలించారు. ఆశ్రయం కోసం వచ్చిన బాలికను సూపరింటెండెంట్ వాడుకున్నాడు.
చిన్నారిని చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా, రాత్రుళ్లు తన గదికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక నిరాకరిస్తే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ ఏడాది అక్టోబరు 27న బాలికను కడప వసతి గృహానికి అధికారులు బదిలీ చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్న బాధిత చిన్నారి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ శివకామినిని కలిసి నందగోపాల్ అకృత్యాలను బయటపెట్టింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.