భారీ వర్షాల కారణంగా తిరుపతి, తిరుమలలో భారీగా నష్టం జరిగింది. ఇప్పటికీ కొండచరియలు ఘాట్ రోడ్డులో విరిగిపడుతుండడం టిటిడి అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు భక్తులు భయబ్రాంతులు గురికావడానికి కారణమవుతోంది. గత నాలుగురోజులకు ముందు రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి రోడ్డు మొత్తం తెగిపోయింది. రక్షణ వలయం మొత్తం కొట్టుకపోయింది.
దీంతో మరమ్మత్తులను ప్రారంభించారు టిటిడి అధికారులు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మొదటి ఘాట్ రోడ్డులో వాహన రాకపోకలు జరుగుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేవలం 40 నిమిషాల్లో తిరుమలకు వెళ్ళాల్సిన భక్తులు కాస్త 3 గంటలకుపైగా సమయం పడుతోంది. అందులోను ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన ఐఐటి నిపుణులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టిటిడి ఛైర్మన్ పరిశీలించారు.
ఈ నెలాఖరు లోగా ఘాట్ రోడ్డును పునఃప్రారంభిస్తామని చెప్పారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండచరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బందులు లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు.
అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు. డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నందు వల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమలలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోందని.. వీరి ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు.