ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులపై కొండచరియలు విరిగిపడి ధ్వంసమవుతున్నాయి. బుధవారం పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడటంతో రెండో కనుమ రహదారి బాగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో భారీ వాహనాలను నిలిపివేశారు. పైగా దెబ్బతిన్న ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు యుద్ధప్రాతిపదిన చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఈ దెబ్బతిన్న రోడ్డు మార్గాన్ని ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం గురువారం పరిశీలించనుంది. ఈ నిపుణుల బృందంలో కేఎస్ రావు, నరసింహారావు, టీటీడీ రిటైర్డ్ సీఈ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా, గత 1973లో రెండో ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టారు. అయితే, భారీ వర్షాల సమయంలో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడి రోడ్డు దెబ్బతింటుంది. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 13 ప్రాంతాల్లో కొండ చరియలు, పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా 16 కిలోమీటరు వద్ద పెద్ద బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు బాగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే ఈ మార్గంలో వాహనాలను అనుమతిస్తున్నారు.