కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై పడింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రాకపోవడంతో లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా అంతే స్థాయిలో తగ్గిపోయాయి. దీంతో శ్రీవారి ప్రసాదాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం కూడా అమాంతం తగ్గిందట. ఈ యేడాది 375 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసిన టిటిడి అంచనాలు తప్పేలా ఉన్నాయి.
కరోనా విజృంభిస్తుండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఎఫెక్ట్ కాస్త లడ్డూ విక్రయాలపై పడింది. లడ్డూ విక్రయాలు లేక కౌంటర్లన్నీ వెలవెలబోతున్నాయి. తిరుమల శ్రీనివాసుడి దర్సనానికి వచ్చే భక్తులు స్వామివారి దర్సనం తరువాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది శ్రీవారి లడ్డూకే.
తిరుమలకు వెళ్ళి వచ్చామంటూ బంధుమిత్రులకు లడ్డూ పంచాల్సిందే. దీంతో భక్తులు లడ్డూప్రసాదాన్ని అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తుంటారు. కరోనా రాక ముందు నిత్యం 60 వేల నుంచి లక్షమంది భక్తులు తిరుమలకు వచ్చేవారు. లడ్డూ విక్రయాలు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండేది.
గతంలో లడ్డూపై సబ్సిడీ ఇస్తుండగా దీన్ని తొలగించారు. 2019-20లో ప్రసాదాల ద్వారా 330 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020-21 లడ్డూ విక్రయాల ద్వారా 375 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని టిటిడి అంచనా వేసింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో టిటిడి అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
లడ్డూ ప్రసాదాల విక్రయాలు అంతంతమాత్రంగా మారింది. ఆదాయం మరింత తగ్గిపోయింది. గతంతో పోలిస్తే ఈ స్ధాయిలో పరిస్థితి ఎప్పుడూ లేదంటున్నారు టిటిడి అధికారులు. లడ్డూ నిల్వలు కూడా అలాగే ఉండిపోయాయి.