తిరుమల వేంకటేశ్వరస్వామికి నిత్యం నిర్వహించే కళ్యాణోత్సవ సేవకు సంబంధించిన టిక్కెట్లను రేపు టిటిడి ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 31వ తేదీ వరకు సంబంధించి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనుంది. అయితే కళ్యాణోత్సవ సేవను ఆన్‌లైన్లో భక్తులు పాల్గొని తిలకించాల్సి ఉంటుంది.
ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభం కానుంది. మొదటి పది నిమిషాలలు టిక్కెట్లను కలిగిన భక్తులకు సంకల్పం చెప్పించనున్నారు అర్చకులు. ఆన్లైన్ ద్వారా కళ్యాణోత్సవం సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టిటిడి చెబుతోంది.
అంతేకాదు వస్త్రం, లడ్డు ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తులకు పంపించనుంది టిటిడి. సాధారణంగా కళ్యాణోత్సవం అంటే శ్రీవారి ఆలయానికి వచ్చి ఆలయం లోపల వైభవోత్సవ మండపంలో కూర్చుని స్వామివారిని దర్సించుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా టిటిడి కళ్యాణోత్సవాన్ని ఆన్లైన్ లోనే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది.