ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో సోనోవిజన్ షో రూమ్ ఉంది. అక్కడి నుంచి భీమవరానికి ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషన్లు ఓ మినీ వ్యాన్‌లో లోడ్ చేశారు.
అయితే ఈ వ్యాన్‌పై యూపీకి చెందిన ఓ దొంగల ముఠా కన్నేసింది. ఇంకేముంది వెంటనే చాకచక్యంగా చోరీ చేసేశారు. వ్యాన్‌ను ఎవరికి అనుమానం రాకుండా ఎనికేపాడు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లిపోవాలని మాస్టర్ ప్లాన్ వేశారు.
అయితే మార్గమధ్యలో కథ అడ్డం తిరిగింది. వ్యాన్‌లో డీజిల్ అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. వ్యాన్‌లో చూస్తే లక్షలాది రూపాయల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి.
దీంతో చేసేదేమి లేక డీజిల్ డబ్బుల కోసం ఎల్‌ఈడీ టీవీనీ రూ.500లకు బేరం పెట్టారు. ఇలా బేరం పెట్టడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం, అందించారు.
దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని పట్టుకున్నారు. చోరీ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ రూ.9 లక్షల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకుని.. దొంగల ముఠా సమాచారం మేరకు సదరు సోనోవిజన్ యజమాన్యానికి సమాచారం అందించారు.