Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాసనసభ కౌరవసభను తలపిస్తోంది: కళావెంకట్రావు

Advertiesment
శాసనసభ కౌరవసభను తలపిస్తోంది: కళావెంకట్రావు
, గురువారం, 23 జనవరి 2020 (19:33 IST)
అసెంబ్లీని వదిలేసి, మండలిలో 22మంది మంత్రులు ఎందుకు కూర్చున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ హక్కుకూడా లేని మంత్రివర్గ సభ్యులందరూ మండలిలో కూర్చునేలా జగన్‌ ఎందుకు ఆదేశించాడని, వారంతా మండలి ఛైర్మన్‌ని, ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని రాచిరంపాన పెట్టాల్సిన అవసరమ ఏమొచ్చిందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు.

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ఏప్రభుత్వమూ కూడా ఏడునెలల్లో ఇంతలా భ్రష్టుపట్టిన దాఖలాలు తాము చూడలేదన్నారు. మంత్రులు, వైసీపీ సభ్యుల ప్రవర్తన చూస్తుంటే, రాష్ట్రప్రజలంతా సిగ్గుపడుతున్నారన్నారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మంత్రులు మండలిలో ప్రవర్తించారన్నారు. తుగ్లక్‌ చర్యలకు నిరసనగా ఇప్పటవరకు హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి 25సార్లు అక్షింతలు వేసిందన్నారు. కౌన్సిల్‌లో నిన్న జరిగిన చర్చపై, అసెంబ్లీలో నేడు (23వ తేదీన) చర్చించడం చూస్తూంటే ఆవాతావరణమంతా కౌరవసభను తలపిస్తోందన్నారు.

కౌన్సిల్‌ జరిగినతీరుని, అసెంబ్లీలో లేని సభ్యులగురించి, వారిని తప్పుపడుతూ ఎలా చర్చిస్తారో, ఏరూల్‌ను అనుసరించి చర్చించారో, రాజ్యాంగం ప్రకారం అదిఎలాసాధ్యమో చెప్పాలని కళా వెంకట్రావు డిమాండ్‌చేశారు. స్పీకర్లు ఎవరూ ఇలాంటి చర్చలను స్వాగతించరని, ఇప్పుడున్న స్పీకర్‌ ఎలా ఒప్పుకున్నాడో  తెలియడంలేదన్నారు.

పార్లమెంటరీ ప్రాక్టీసెస్‌, కౌల్‌ అండ్‌ షక్దర్‌ నిబంధనలప్రకారం   గతంలో అనేక బిల్లులు అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వచ్చాయని, అక్కడి నుంచి సెలక్ట్‌ కమిటీకి పంపబడ్డాయని, అక్కడినుంచి వచ్చాక పాసయిన సందర్భాలు అనేకం ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకింత తపన పడుతోందని, రెండు, మూడునెలలు కూడా ఆగకుండా ఎందుకింతగా ఆత్రుతపడుతుందో తెలియడంలేదన్నారు.

ప్రభుత్వ  తపన చూస్తుంటే, వ్యాపారాలు, వ్యవహారాలు, భూముల అమ్మకంపై తమవారికి ఇచ్చిన హామీలపై ఆందోళన చెందుతున్నట్లుగా ఉందన్నారు. బిల్లు సెలక్ట్‌ కమిటీకి పంపగానే దూషణలకు దిగుతూ, అంతలా సృతిమించి ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింద ని కళా నిలదీశారు.

మండలిలో మంత్రులంతా హద్దుమీరి ప్రవర్తించారని, బల్లలపైకి ఎక్కి కులం-మతం పేరుతో దూషిస్తూ, ఉన్నతమైనస్థానంలో ఉన్నవ్యక్తిని ఉద్దేశించి వాడిన పదజాలాన్ని రాష్ట్రప్రజానీకమంతా గమనించిందన్నారు. మండలిలో మంత్రులు వాడిన భాష, వారిప్రవర్తనకు సంబంధించిన వీడియోలను ప్రజల ముందుపెట్టాక, ప్రభుత్వం మండలితీరుతెన్నులపై మాట్లాడాలని కళా సూచించారు.

అసెంబ్లీస్పీకర్‌ ప్రతిపక్షపార్టీ సభ్యులకు విడిగా సీట్లుకేటాయించడం ఎలా సాధ్యమైందో, మండలి ఛైర్మన్‌ వ్యవహరించారని, స్పీకర్‌ చేస్తే తప్పుకానప్పుడు, మండలిఛైర్మన్‌ చేసింది తప్పెలా అవుతుందన్నారు. ఉన్నతమైన లోక్‌సభ, రాజ్యసభల్లోకూడా ఏనాడూ ఎవరూ సంయమ నం కోల్పోలేదని, మార్షల్స్‌ను ఇష్టానుసారం వినియోగించడం, గీతలు గీయమని చెప్పడం ప్రజాస్వామ్యంలో ఎన్నడూ చూడలేదన్నారు.

ప్రతిపక్షం ప్రశ్నిస్తే, తిరిగి ప్రశ్నించడం తప్ప, ప్రభుత్వం ఎక్కడా సరైనవిధంగా సమాధానం చెప్పడంలేదన్నారు. మండలిలో బిల్లు పాస్‌ కాలేదని దాన్ని రద్దుచేయడం, మాటవినలేదని ఉద్యోగుల్ని డిస్మిస్ చేయడం పాలన కాదని, అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తిస్తే  ప్రభుత్వానికి మంచిదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఇదంతా తెలుసా?