Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బంది కష్టాలను ప్రభుత్వం గుర్తించాలి: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌‌

ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బంది కష్టాలను ప్రభుత్వం గుర్తించాలి: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌‌
, సోమవారం, 29 జూన్ 2020 (18:32 IST)
ప్రైవేటు విద్యాలయాల్లోని టీచర్ల కష్టాలను కూడా ప్రభుత్వం గమనించి ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 

విద్యాబుద్ధులు నేర్పే గురువును దైవంతో సమానంగా చూసే సంస్కృతి మనదని, కరోనా విపత్తు వల్ల ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. 

"గత నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడం వల్ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఓనమాలు నేర్పే గురువులు నడిరోడ్డున నిలవాల్సి రావడం బాధాకరం. జీతాలు లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు రోడ్డుపై బండ్ల మీద పళ్ళు, కూరగాయలు అమ్ముకొంటున్నారని మాధ్యమాల ద్వారా తెలిసింది.

కరోనా సమయంలో ఆర్థికపరమైన ఒడిదొడుకులు వస్తున్నాయి. చిన్నపాటి ప్రైవేట్ పాఠశాలలకు అలాంటి ఇక్కట్లు, వనరులు సమకూర్చుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో నిలదొక్కుకొని ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం ఆశ్చర్యకరం.

ఎందరో భవిష్యత్ ను తీర్చిదిద్దే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రైవేట్ రంగంలో పని చేయడం వల్ల ఏడాదిలో పది నెలల జీతం మాత్రమే వస్తోందని, ఈ యేడాది కరోనా వల్ల అది కూడా లేకుండాపోయిందని సంబంధిత సంఘాల ప్రతినిధులు జనసేన పార్టీకి వినతి పత్రం అందచేశారు.

ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో 5 లక్షల మందికిపైగా బోధన సిబ్బంది ఉన్నారు. ఆయా విద్యా సంస్థలు యేడాది ఫీజులు వసూలు చేసినా తమకు మాత్రం కరోనా పేరుతో గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబం గడవటం ఇబ్బందికరంగా మారిందనీ, బోధన వృత్తి నుంచి హాకర్లుగా, రోజు కూలీలుగా మారుతున్నారని వాపోయారు.

ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి రుసుములు తీసుకొంటున్న సంస్థలు తమ సిబ్బందిని తగ్గించేస్తున్నాయనే విషయం పార్టీ దృష్టికి వచ్చింది.  లక్షల్లో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల కష్టాలను రాష్ట్ర విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగాలు చేస్తున్నవారిని ప్రభుత్వం గుర్తించి తక్షణ ఉపశమనం కోసం ఆర్థిక సాయం అందించాలి. తమకు పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. కల్పించాలని ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ కోరుతోంది. వీటిని కల్పించడంపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

బతక లేక బడిపంతులు అనే గతకాలపు మాటను వర్తమానంలో నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, విద్యాసంస్థల నిర్వాహకులపైనా ఉంది" అని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ - విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు నడపాలి : మంత్రి కేటీఆర్