సులభరత వాణిజ్యమే ధ్యేయమని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అయితే వ్యాపారం కూడా తక్కువ ఖర్చుతో ..ఎక్కువ లాభం వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.
విశాఖపట్నం జిల్లాలో మంగళవారం నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన యూఎన్ఐడీవో (ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ) – డీపీఐఐటీ (పారిశ్రామిక, ప్రోత్సాహక అంతర్గత వర్తక విభాగం) పరస్పర అవగాహన సదస్సులో పరిశ్రమలు, వాణిజ్య, .టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక పారిశ్రామిక రంగం వైపు మళ్లకుండా ప్రపంచంలో ఏ దేశమూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించలేదని మంత్రి తెలిపారు.
మహిళలు, యువతకు అవకాశాలు లేకపోవడంతో గతంలో పారిశ్రామిక కేంద్రీకరణ జరిగిందని, మారుతున్న సమాజానికి అనుగుణంగా అందరికీ అవకాశాలు కల్పించడం వల్లే అసలైన వృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
పారదర్శకతతో కూడిన పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.
పారిశ్రామిక రంగం ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు సమగ్ర రాష్ట్రాభివృద్ధి సాధించాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల ఆర్థిక వృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యాన్ని పెంచే రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటోందని మంత్రి తెలిపారు.
వాతావరణ కాలుష్యం లేని, స్వచ్ఛమైన, అచ్చమైన పరిశ్రమలను రాష్ట్రంలో స్థాపించేందుకే పెద్దపీట వేస్తామని మంత్రి మేకపాటి అన్నారు.
ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎలాంటి పసలేని ప్రచారం చేసుకున్నా..రాష్ట్ర ప్రజలు సగర్వంగా చెప్పుకునే పరిశ్రమలను తీసుకురావడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి మరింత పెరుగుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
యువతను నాణ్యమైన శ్రామిక శక్తిగా తీర్చిదిద్దేందుకు కావలసిన నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు మంత్రి మేకపాటి. వేగంగా పారిశ్రామికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించామన్నారు.
రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న సహజవనరులను ఉపయోగించుకుంటూ సులభతర వాణిజ్యంతో పాటు ఖర్చు తక్కువ వ్యాపారానికి ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఆయన చెప్పారు.
ఉపాధి అవకాశాలు పెంచే విధంగా సూక్ష్య,చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిపుష్ఠి కోసం ఇప్పటికే ‘వైఎస్ఆర్ నవోదయం’ పథకాన్ని తీసుకువచ్చామని, దీంతో ఊహించని, కచ్చితమైన మార్పులు తథ్యమని మంత్రి వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాలలోనూ ఆర్థిక సుస్థిరత సాధించే వీలుగా, ఆహార భద్రతను పాటించి, ఆహార వృథాను తగ్గించేలా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
పారిశ్రామిక నగరం, పోర్టుల స్వర్గధామమైన విశాఖ నగరం ఇప్పటికే రాష్ట్ర జీడీపీలో 14 శాతం వాటా కలిగి ఉందని, ఉక్కు, పరిశ్రమలు, తవ్వకాలు, జింక్, శుద్ధి, ఎలక్ట్రానిక్, వస్త్ర పరిశ్రమల వంటి అన్ని రకాల పరిశ్రమలకు అనువైన విశాఖను విశ్వనగరంగా నిలబెడతామని మంత్రి తెలిపారు.
వ్యాణిజ్య సంబంధాలు, వ్యవస్థాపక, నిరంతర ఆర్థిక వైవిధ్యీకరణ, పారిశ్రామిక నవీకరణ , సాంకేతిక ఆవిష్కరణలతో ఎంఎస్ఎమ్ఈలను బలోపేతం చేసే చర్యలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తామని మంత్రి స్పష్టం చేశారు.
నిజనిర్ధారణ కమిషన్ తో ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలుసుకుంటూ సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అనుభవం, పాఠాలు నేర్చుకుంటూ అభివృద్ధివైపు అడుగేస్తూ ఏపీని రోల్ మోడల్ గా నిలపడమే లక్ష్యంగా సాగుతామన్నారు.
ఈ అవగాహన సదస్సు తర్వాత మంత్రి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలోలాగా అనవసర ఆర్భాటాలు, ఆడంబరాలకు వెళ్లమని మంత్రి అన్నారు.
ఎన్ని అవాంతరాలు తెచ్చినా, ఎన్ని అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసినా చిత్తశుద్ధితో ముందుకు వెళతామని, అంకితభావాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తామని మేకపాటి అన్నారు.
మిలీనియం టవర్స్ లో ఉన్న ఐ.టీ కంపెనీలు, రాష్ట్రం నుండి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ఓ వర్గం సామాజిక మాధ్యమం వేదికగా చేస్తున్న ప్రచారం అంతా అసత్యమని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు.
అదానీ గ్రూపు రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుందన్న ప్రకటన గత ప్రభుత్వం ప్రచారం కోసం వాడుకున్నదే తప్ప అసలు వాస్తవం వేరని ఆ సంస్థ ప్రతినిధులే చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు.
అదానీ గ్రూపు డేటా సెంటర్ ఏర్పాటుకు మరో ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని చూపేందుకు నిబద్ధతతో ముందుకు వెళుతున్నామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ , యునిడో భారతదేశ ప్రాంతీయ కార్యాలయ ప్రతినిధి రెనె వాన్ బెర్కెల్, యునిడో IC-ISID) డైరెక్టర్ రాజీవ్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పరిశ్రమల శాఖ పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.