అసలే కరోనా కాలం.. నిరుపేదల పరిస్థితి మరింత దయనీయం. తినడానికి తిండి లేని పరిస్థితి. కూలీ పని చేసుకునే అవకాశం లేదు. ఇక రైతులంటారా.. సరైన వర్షాలు లేక.. వేసిన పంట చేతికందక లబోదిబోమంటూ నష్టాల పాలైపోయారు. చేసిన అప్పులు కట్టలేక విలవిలలాడిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక రైతు తనకున్న ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న ఎద్దులను కూడా అమ్మేశాడు. ఇంకేముంది తెలిసిన స్నేహితుడిని పొలాన్ని కౌవులకు తీసుకుని పంట వేయడానికి సిద్ధమయ్యాడు. చేతిలో డబ్బులు లేకపోయినా ఏదోలా కాస్త సర్ది పొలంలోకి వెళ్ళాడు.
ఎద్దులు లేవు. ఏం చేయాలో పాలుపోలేదు. తన ఇద్దరు కూతుళ్లను చూస్తూ దిగాలుగా కూర్చున్నాడు. దీంతో కూతుర్లే నాగలిని పట్టుకున్నారు. కాడి పట్టుకుని గట్టిగా ముందుకు లాగారు. కూతుర్లే పొలం దున్నతుంటే తండ్రి ఆశ్చర్యపోయాడు. కష్టకాలంలో కూతుళ్లు తనకు సహకరిస్తుండటంతో అతనికి కన్నీళ్లు ఆగలేదు. తల్లి కూడా పొలంలో పనిచేస్తోంది.
ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఎద్దులు చేయాల్సిన పనిని కుమార్తెలు చేస్తుంటే ఆ తండ్రి ఆవేదన అంతాఇంతా కాదు. కానీ తన కష్టంలో కుమార్తెలు పాలుపంచుకోవడంతో ఆ తండ్రికి మరోవైపు సంతోషం కూడా కలిసింది. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతు నాగేశ్వరరావు కోరుతున్నాడు.