Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిశ బిల్లు అద్భుతమైన శాసన నిర్ణయం: మహారాష్ట్ర హోంమంత్రి

దిశ బిల్లు అద్భుతమైన శాసన నిర్ణయం: మహారాష్ట్ర హోంమంత్రి
, గురువారం, 20 ఫిబ్రవరి 2020 (22:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకై ప్రవేశపెట్టిన దిశ బిల్లును చారిత్రాత్మక, అద్భుతమైన శాసన నిర్ణయంగా మహారాష్ట్ర హోంశాఖామంత్రి అనిల్ దేశ్ ముఖ్ కొనియాడారు.

మహిళలు, బాలికల రక్షణకై దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకువచ్చిన దిశ చట్టం(బిల్లు) అమలును పరిశీలించేందుకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలోని గల అధికారుల బృందం గురువారం రాష్ట్రానికి వచ్చింది.

ఈ సందర్భంగా అమరావతి సచివాలయం మొదటి భవనంలో రాష్ట్ర హోం, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రుల తోపాటు సిఎస్, డిజిపిలతో సమావేశమై దిశ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మహారాష్ట్ర హోంశాఖామంత్రి అనిల్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన దిశ బిల్లు తీసుకువచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జనగన్మోహన్ రెడ్డికి హోం,మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రులు, సిఎస్, డిజిపి సహా ఈ దిశ బిల్లు అమలుకు కృషి చేస్తున్న అందరికీ ప్రత్యేక అభినందలు తెలియజేశారు.

ఇదే విధమైన బిల్లును మహారాష్ట్రలో కూడా తీసుకువచ్చేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దిశ బిల్లు తెచ్చిన రెండు మాసాల్లోనే ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ ను కూడా ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు.

దిశ బిల్లుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి పూర్తి వివరాలను, సమాచారాన్నిఅనుభవాలను తీసుకుని మహారాష్ట్ర లో కూడా ప్రవేశపెట్టందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.
 
సమావేశంలో రాష్ట్ర హోంశాఖామంత్రి మేకతోటి సుచరిత ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరిగే నేరాల అదుపునకు ఈ దిశ బిల్లును తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.

దిశ బిల్లును పటిష్టంగా అమలు చేసేందుకు గత రెండు మూడు మూడు మాసాలుగా పెద్దఎత్తున కసరత్తు చేయడం జరుగుతోందని ఇందుకై ఇప్పటికే ప్రభుత్వం రూ. 87 కోట్లు మంజూరు చేయడమైనదని తెలిపారు.

నేరం జరిగిన వారం రోజుల్లోగా దర్యాప్తు, 14 రోజుల్లోగా ట్రయల్ పూర్తిచేసి 21 రోజుల్లోగా నేరస్తులకు శిక్షలు పడేరీతిలో దిశ బిల్లును రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు.

ఇందుకై 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాజిక్యూటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల రాజమండ్రిలో ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించుకోవడం జరిగిందని వివరించారు.

దిశ బిల్లుపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించేందుకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ విధమైన కేసుల సత్వర పరిష్కారానికి ఆధారాలు నమోదుకు దిశ క్రైమ్ డిటెక్షన్ కిట్లను అందించడం జరుగుతోందని ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

అంతేగాక దిశ కింద నమోదయ్యే సంఘటనల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్, ఒన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు హోం మంత్రి సుచరిత వివరించారు.

2020 ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దడం,ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సుచరిత మహారాష్ట్ర బృందానికి వివరించారు.
 
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు, బాలికల రక్షణకై తీసుకువచ్చిన దిశ బిల్లు ఒక చారిత్రాత్మకమైన బిల్లుగా పేర్కొన్నారు.

ఈ ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా డిక్లేర్ చేసే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి దిశ బిల్లును పటిష్టంగా అమలు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని ఇందుకు ఎన్ని నిధులైనా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలోని మహిళలు, బాలికల్లో  ఆత్మస్థైర్యాన్ని ఒక భరోసాను కల్పించే లక్ష్యంతోనే దిశ బిల్లును తీసుకురావడం జరిగిందని తెలిపారు.
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తొలుత సమావేశానికి స్వాగతం పలికి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేసిన తర్వాత దిశ బిల్లును తీసుకురావడం జరిగిందని తెలిపారు.

ఈ బిల్లు అమలులో భాగంగా పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఈ దిశ బిల్లు అమలు పర్యేవేక్షణకు ఇద్దరు మహిళా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని చెప్పారు.

సంఘటనలు జరిగిన స్వల్ప వ్యవధిలోనే ఆయా కేసుల దర్యాప్తును పూర్తిచేసి నిందితులకు శిక్షలు పడేరీతిలో పటిష్టమైన నిబంధనలతో కూడిన ఈబిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదంతో కేంద్రానికి పంపడం జరిగిందని పేర్కొన్నారు.

ఈబిల్లు అమలులో పోలీస్ శాఖ కీలకపాత్ర పోషించనుండగా మహిళా శిశు సంక్షేమం తదితర విభాగాలు కూడా మెరుగైన పాత్ర పోషించనున్నాయని సిఎస్ చెప్పారు.
 
రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ దిశ కింద నమోదైన కేసుల్లో బాధితులకు సంబంధించిన పరీక్షలు సకాలంలో నివేదికలు అందించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రధాన ఫోరెన్సిక్ ల్యాబ్ లతోపాటు మరో రెండు ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

దిశ ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తేవడం జరిగిందని ఎవరైన మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఈయాప్ ను ఉపయోగించాలని సకాలంలో సంఘటనా ప్రాంతానికి దిశ సిబ్బంది చేరుకుని వారికి రక్షణగా నిలబడతారని చెప్పారు.

ఇప్పటి వరకూ రాష్ట్రంలో దిశ మొబైల్ అప్లికేషన్ ను లక్షా 40వేల మంది డౌన్ లోడ్ చేసుకోగా 10వేల టెస్ట్ కాల్స్ కూడా రాగా వాటిలో 35 యాక్టివ్ కాల్స్ ఉన్నాయని తెలిపారు.ఇప్పటి వరకూ దిశకు సంబంధించి 14 ఎఫ్ఐఆర్ లు రిజిస్టర్ కావడం జరిగిందని డిజిపి సవాంగ్ పేర్కొన్నారు.
 
దిశ పోలీస్ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దిశ అమలుకు సంబంధించి వివరిస్తూ రాష్ట్రంలో 13 దిశ ఒన్ స్టాప్ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు.రాష్ట్రంలో ప్రప్రథమంగా కృష్ణా జిల్లా కంచికచర్లలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 165 జీరో ఎఫ్ఐఆర్ లను రిజిష్టర్ చేశామని పేర్కొన్నారు.

దిశ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడం తోపాటు మొబైల్ మిత్ర,సైబర్ మిత్రల ద్వారా కూడా ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడం జరుగుతోందని తెలిపారు.
 
దిశ ప్రత్యేక అధికారి కృతికా శుక్లా మాట్లాడుతూ దిశ బిల్లును పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ దిశ బిల్లుతో రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు మరింత రక్షణ చేకూరుతుందని పేర్కొన్నారు.
 
ఈ సమావేశంలో మహారాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఆరాష్ట్ర డిజిపి సుభోద్ కుమార్,ఆరాష్ట్ర మహిళా ప్రొటెక్షన్ సెల్ ఐజి డా.డి.ప్రతాప్, మరో ఐజి అశ్వతి డార్జే(Ashwathi Darje),రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అదనపు డిజిపి రవిశంకర్ అయ్యన్నార్, డిఐజి టెక్నికల్ జి.పాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరి ప్రాణాలు తీసిన ఈత సరదా.. క్వారీలో పడి ఇద్దరు అమ్మాయిలు గల్లంతు