ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు దారుణంగా మారాయి. రోజు రోజుకు పార్టీల మధ్య అంతరాలు పెరిగిపోయి, చివరికి మీడియాలో కూడా విష సంస్కృతి మొదలైపోయింది. ఇప్పటికే ఫలానా ఛానల్ ఫలానా పార్టీది అని, ఫలానా పేపర్ ఫలానా పార్టీకి కొమ్ము కాస్తుందనే ముద్ర ఎపుడో పడిపోయాయి. ఇక అవి శృతి మించి, ఒకరిపై ఒకరు బ్యాన్ లు పెట్టేవరకు, ఛానళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెట్టేవరకు పరిస్థితి వెళ్లిపోయింది. తాజాగా నాలుగు ఛానళ్లను తాము బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుగుదేశం పార్టీ వారి వాట్స్ అప్ సందేశాలు వైరల్ అయ్యాయి.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్, పార్లమెంట్ ప్రెసిడెంట్, రాష్ట్ర కమిటీ సభ్యులకు, ముఖ్య నాయకులకు నమస్కారం అంటూ టీడీపీ ఒక మెసెజ్ అందరికీ పాస్ చేసింది. తెలుగుదేశంపార్టీ ఈ నాలుగు చానళ్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తెలిపింది. సాక్షి, ఐ-డ్రీమ్, టివి-9, ప్రైమ్ 9 నాలుగు ఛానళ్ళను తమ పార్టీ పక్కన పెట్టేసినట్లు పేర్కొంది. దయ ఉంచి ఈ చానళ్లకు, ఎటువంటీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తెలుగుదేశం నాయకులు వెళ్లరాదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అమరావతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు ఈ మెసేజ్ అందరికీ పాస్ చేశారు. ఈ నాలుగు ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయాయని, వాటిని ఎట్టి పరిస్థితులలో ప్రోత్సహించరాదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా ఇలా చేయడం తగిన సమయంలో తగిన చర్య అని మిగతా తెలుగుదేశం నాయకులు సంఘీభావం తెలపడం కొసమెరుపు.