తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రెండు మేకలకు పోలీసులు జరిమానా విధించారు. ఈ మేకలు చేసిన నేరమేంటో తెలుసా? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు. ఇంతకు ఆ మేకలు ప్రభుత్వ ఆస్తులను ఎలా ధ్వంసం చేశాయో తెలుసుకుందాం.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో స్థానికంగా పని చేసే సేవ్ ది ట్రీస్ అనే ఓ ఎన్జీవో సంస్థ సుమారుగా వెయ్యి మొక్కలను నాటింది. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు మేకలు ఆ మొక్కల్లో 280 నుంచి 300 మొక్కలను మేశాయి. వీటిలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఈ మొక్కలను ప్రభుత్వ ఆస్తులుగా పోలీసులు పరిగణించారు.
ఈ నేపథ్యంలో మొక్కలను తినేస్తున్న రెండు మేకలను ఎన్జీవో సభ్యులు పట్టుకెళ్లి పోలీసు అధికారులకు అప్పగించారు. దీంతో తన మేకలు కనిపించకపోవడంతో వాటి యజమాని రాజయ్య స్టేషన్‌కు రాగా, పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ మొత్తం జరిమానా కట్టిన సదరు యజమాని, తన మేకలను విడిపించుకుని వెళ్లారు. మొత్తంమీద ఈ సంఘటన స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది.