పిల్లల జీవితాలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల కంటే గురువుల పాత్ర మరింత కీలకమని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఎస్ఈఐఎఫ్) చైర్మన్ శ్యామ్యుల్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లలతో ప్రత్యేకమైన సంబంధమేమీ లేకపోయినా వారి ఉన్నతి గురించి ఉపాధ్యాయుడు మాత్రమే ఆలోచిస్తారని ఆయన అన్నారు.
శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎస్ఈఐఎఫ్ ఆధ్వర్యంలో.. పిల్లల మానసిక పెరుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర (ట్రెండ్) ఇతివృత్తంతో జిల్లాలోని ఉపాధ్యాయులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో..జిల్లా డీఈవో శ్రీమతి పగడాలమ్మ, సంస్థ చైర్మన్ శ్యామ్యుల్ రెడ్డితోపాటు వివిధ పాఠశాలల అధ్యాపకులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్యామ్యుల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అందరికంటే ఎక్కువ గౌరవ ఉపాధ్యాయులకే ఉంటుందని.. విద్యార్థుల మానసిక వికాసంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. దేశ ప్రధానమంత్రి అయినా ఉపాధ్యాయుడి పాఠాలు నేర్చుకుంటారని ఆయన గుర్తుచేవారు. సేవా కార్యక్రమాలకు గానూ గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సమయంలోనూ.. తనను ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువులే గుర్తొచ్చారని ఆయన పేర్కొననారు. వారు నేర్పిన పాఠాలు, విద్యాబుద్ధులే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు.
ఈ సంస్థ ఏర్పాటుకు గల కారణాలను శ్యామ్యుల్ రెడ్డి వివరిస్తూ.. అనుకోని పరిస్థితుల్లో మా ఇంట్లో జరిగిన ఘటన ఎంతో వేదన మిగిల్చింది. మేము బాధపడినట్లుగా ఏ తల్లిదండ్రి కూడా ఆవేదన చెందకుండా ఉండాలనే ఆశయంతోనే ఫౌండేషన్ ప్రారంభించాం అని ఆయన పేర్కొన్నారు. పిల్లల్లో బలవన్మరణాలను నివారించాలని సంకల్పించుకుని ఆ ఉద్దేశ్యంతోనే ముందుకెళ్తున్నామన్నారాయన. గుంటూరులో 25 కోట్ల రూపాయలతో బలవన్మరణాల నివారణకు సైకలాజికల్ & కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని నెలకొల్పడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అందుకే ఉపాధ్యాయుల కోసం ఈ కార్యక్రమాన్న ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో శ్రీమతి పగడాలమ్మ మాట్లాడుతూ.. కూతురుని పోగొట్టుకున్న తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో ఈ రోజు చూశానన్నారు. తన కూతురు పోయిన ఆవేదనలోనూ.. ఇతర తల్లిదండ్రులు తనలా బాధపడకూడదనే సత్సంకల్పంతో శామ్యూల్ రెడ్డి గారు సంస్థను ప్రారంభించిన విద్యార్థులు, వారికి మార్గదర్శనం చేసే ఉపాధ్యాయుల్లో చైతన్యం తీసుకొచ్చేదిశగా ఆలోచించడం గొప్ప విషయమన్నారు.
విద్యార్థులు తీవ్ర నిర్ణయాల వరకు వెళ్లకుండా చూసే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పై ఉందని.. ఆ బాధ్యతను గుర్తు చేస్తున్న స్పందన ఫౌండేషన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల కోసం కోసం తల్లిదండ్రులు రోజు ఎంతో కొంత సమయం కేటాయించాలని, పిల్లలకు సమయం, డబ్బు విలువ తెలియజేయాలని శ్రీమతి పగడాలమ్మ సూచించారు. బలవన్మరణాల నివారణ కోసం ప్రపంచ ఆత్మహత్య ల నివారణ దినం సందర్భంగా స్పందన ఈదా ఫౌండేషన్ 14 కేంద్రాల్లో ఏక కాలంలో అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని ఆమె పేర్కొన్నారు.