Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి జెఏసి ఆందోళనలకు టిడిపి మద్దతు

Advertiesment
అమరావతి జెఏసి ఆందోళనలకు టిడిపి మద్దతు
, శనివారం, 22 ఆగస్టు 2020 (12:43 IST)
రాజధాని 3 ముక్కలాటకు వ్యతిరేకంగా అమరావతి జెఏసి ఆందోళనలు 250రోజుల సందర్భంగా ఆదివారం జెఏసి చేపట్టిన నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. 
 
రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అన్నివర్గాల ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొనడం ద్వారా, రాజధానికి వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులకు అండగా నిలవాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆదివారం జరిగే నిరసన కార్యక్రమాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమరావతి రైతులు,మహిళలు, రైతుకూలీలకు సంఘీభావం తెలపాలని పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించడం, తదితర కార్యక్రమాల్లో 13 జిల్లాల ప్రజలు చురుకుగా పాల్గొనాలని కోరారు. 

"రాజధాని 3ముక్కలాట అంశంపై అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని టిడిపి చేసిన డిమాండ్ కు వైసిపి ముందుకు రాకపోవడాన్ని బట్టే, ఆ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాల ప్రజల మద్దతు లేదనేది వెల్లడైంది. 
అన్ని జిల్లాల ప్రజలు ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా రాష్ట్రప్రభుత్వానికి కనువిప్పు కలగక పోవడం శోచనీయం.

ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి, అభివృద్ది వికేంద్రీకరణలో భాగమే అమరావతి అనేది అందరికీ రుజువైంది. ఏది అభివృద్ది, ఏది విధ్వంసం అనేది ప్రతిఒక్కరికీ తెలిసిపోయింది. గతంలో రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అన్ని జిల్లాలకు నడిబొడ్డున ఉండాలని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేకనే, రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానని అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్దంగా ఇప్పుడు వ్యవహరించడం గర్హనీయం.  
 
రాష్ట్రంలో ప్రజలందరి ఆమోదంతోనే, 13వేల గ్రామాలు, 3వేల వార్డులలో పవిత్ర మట్టి, పుణ్యజలాలను ఊరేగింపుగా తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశామనేది మరిచిపోరాదు. యావత్ దేశం, మొత్తం పార్లమెంటు అమరావతికి అండగా ఉంటాయన్న ప్రధాని నరేంద్రమోది వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి.

కేంద్రం చేసిన చట్టంతో, కేంద్రం నియమించిన కమిటి సిఫారసులతో రాజధానిగా అమరావతి ఎంపిక జరిగింది, కేంద్రం ఇచ్చిన నిధులతో అమరావతి నిర్మాణం జరుగుతోంది అనేది అందరికీ తెలిసిందే.

గత ప్రభుత్వాల అభివృద్దిని కొనసాగించాలే తప్ప నాశనం చేయడం గర్హనీయం. అభివృద్దిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. రాజధాని 3ముక్కలు చేయడం అభివృద్ది కాదు. చేతనైతే అభివృద్దిలో పోటీబడాలి, పోటీబడి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టాలి, 13జిల్లాలను మరింతగా అభివృద్ది చేయాలి. అంతే తప్ప ఒకవ్యక్తి మీదో, పార్టీ మీదో, వ్యవస్థ మీదో కక్షతో సమాజాన్ని నాశనం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు సహించరు.

ఇకనైనా వైసిపి ప్రభుత్వం మొండి పట్టుదల మాని, 3ముక్కలాట చర్యలకు స్వస్తి చెప్పాలి. అమరావతి రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కాపాడాలి, రాష్ట్రాభివృద్దికి పాటుబడాలి" అని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ నిరుద్యోగులను నిలువునా మోసగించాడు