గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖలో పనులన్నీ పూర్తి పారదర్శకంగా జరుగుతాయని కమిషనర్ జి. ఎస్ నవీన్ కుమార్ అన్నారు. ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలంలో పెద్ద భీంపల్లికి చెందిన గ్రామ వాలంటీర్ వైఎస్ ఆర్ చేయూత పథకం లబ్దిదారుల నుంచి లంచం తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ గ్రామవాలంటీర్ ని విధులనుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ పథకాల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఎంతో ఉన్నత ఆశయంతో రూపొందిన సచివాలయాల వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది ఉండదన్నారు.
లబ్ది దారులు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరికీ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని ఒకవేళ ఎవరైనా అలా అడిగితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరారు.