జగన్ ఆ ఛాన్స్ మిస్సయ్యాడు.. రాజకీయ సన్యాసమే బెస్ట్: జేసీ దివాకర్ రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంత ప్రజలకు తగిన న్యాయం చేయలేకపోతున్నాననే కారణంతో ఎంపీ పదవికి రాజీనామ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంత ప్రజలకు తగిన న్యాయం చేయలేకపోతున్నాననే కారణంతో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన జేసీ దివాకర్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే సీనే లేదని జోస్యం చెప్పారు. జగన్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటేనే మంచిదని జేసీ సూచించారు.
జగన్ చేపట్టనున్న పాదయాత్రపై కూడా జేసీ విమర్శలు గుప్పించారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే ఆయన పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని.. అనంతపురం జిల్లా సమస్యలను తీర్చుతానని సీఎం చంద్రబాబు మాట ఇచ్చారన్నారు. అందుకే రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గానని వివరణ ఇచ్చుకున్నారు. 2019లో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు.
అంతేకాదు ప్రజలు జగన్‌ను నమ్మడం లేదని, తొలిసారి సీఎం అయ్యే అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నాడని అన్నారు. తాను అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను జగన్ నవరత్నాల పేరుతో ప్రచారం చేస్తున్నారని జేసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ నవరత్నాలు లేవు... నాపరాళ్లు లేవు అంటూ తీసిపారేశారు. శుక్రవారం పూట జగన్ కోర్టుకు రాకపోతే జడ్జి ఊరకుండరని.. అలాంటి తరుణంలో పాదయాత్ర ఎలా చేస్తాడో వేచి చూడాలన్నారు.
ఒకవేళ గురువారం రాత్రి బయల్దేరి శుక్రవారం పూట కోర్టుకొచ్చి... శని, ఆదివారాలు భార్యాబిడ్డలతో జగన్ గడుపుతాడేమోనని జేసీ ఎద్దేవా చేశారు. సీఎం అయ్యే ఛాన్సును జగన్ కోల్పోయారని.. ఇకపై ఆయన సీఎం కావడం ఇంపాజుబుల్ అన్నారు.