తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటైన కౌంటర్ ఇచ్చారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇందుకోసం రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించనక్కర్లేదని, మూడు రాజధానులకు మద్దతిస్తే మంగళరి ఎమ్మెల్యే కరకట్ట కమల్ హాసన్ (ఆళ్ళ రామకృష్ణారెడ్డి)తో రాజీనామా చేయిస్తే సరిపోతుందన్నారు. దీనికి దొంగలెక్కల విజయసాయి రెడ్డిగారు సిద్ధంగా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎన్నికలకు వెళదాం రండి అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాలు చేశాడని, మంగళగిరిలో కొడుకును ఓడగొట్టుకున్న చంద్రబాబుకు ఈసారి కుప్పం కూడా గోవిందా గోవిందా అంటూ వైకాపా ఎంపీ విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వీటిపై బుద్ధా వెంకన్న స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్ఈసీ ప్రయత్నిస్తుంటే, కరోనా పేరు చెప్పి పారిపోయిన మీకు కుప్పం చాలెంజ్ అవసరమా? అని చురకలంటించారు.
'అయినా, నీకేం పోయింది... ఓట్లతో సంబంధంలేని రాజ్యసభ ఎంపీవి. రాజీనామా అంటూ సవాల్ విసిరి 151 మందిని ఇరికించేస్తున్నావు. మీకు ఎన్నికలు జరిపే దమ్ము ఉంటే టీడీపీ దగ్గర కొన్న ఎమ్మెల్యేలతో ఎప్పుడో రాజీనామాలు చేయించేవారు.
రాష్ట్రమంతటా ఎందుకు విజయసాయిరెడ్డీ... మూడు రాజధానులకు మద్దతిచ్చే మంగళగిరి ఎమ్మెల్యే కరకట్ట కమల్ హాసన్‌తో రాజీనామా చేయించు' అంటూ బుద్ధా ప్రతి సవాల్ విసిరారు.