తమతో 40 మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయడంతో ఆమె అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీనిపై వంగపూడి అనిత మాట్లాడుతూ, వైకాపాకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే ఆగమేఘాలపై వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వారి గురించి తెలిస్తే సీఎం జగన్‌కు పక్షవాతం వస్తుందంటూ ఆమె ఎద్దేవా చేశారు.
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదనతో మాట్లాడితే... ఊసరవెల్లి శ్రీదేవి అంటూ మంత్రి అమర్‌నాథ్ మాట్లాడడం దారుణం. ఎంత డబ్బు ఇచ్చి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును వైకాపాలోకి తెచ్చుకున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో తెదేపాకు ఎన్ని ఓట్లు వచ్చాయి, వైకాపాకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకొని మంత్రి రోజా మాట్లాడాలి అని హితవు పలికారు.