కరోనా రెండో దశ వ్యాప్తిని కట్టడిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కరోనా విజృంభిస్తోందన్నారు. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ 20 రెట్లు ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం సహా అనేక సంస్థలు హెచ్చరించాయని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ, సకాలంలో మందులు, బెడ్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ నిర్లక్ష్యం ప్రదర్శించి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రాష్ట్రంలో నాయకత్వ లేమిని ప్రజలు కళ్లారా చూస్తున్నారు. గతంలో విపత్తులు ఎదురైన సమయంలో చంద్రబాబు నాయుడి చొరవ చూశాం.
హుదూద్ తుపాను సమయంలో విశాఖను రోజుల వ్యవధిలో పూర్వ వైభవానికి తీసుకురావడం కళ్లకు కడుతోంది. తూర్పుగోదావరి జిల్లా వరదల్లో అతలాకుతలమైనపుడు ఆయన పనితీరు, తెగువ, చిత్తశుద్ధి గమనించాం. కానీ నేటి ముఖ్యమంత్రి నుండి అలాంటి భరోసా ప్రజలకు కనిపించడంలేదు. ప్రజలు ఇంతగా అవస్థలు పడుతున్నా.. తాడేపల్లి ప్యాలస్ నుండి బయటకు అడుగు కూడా పెట్టడం లేదు.
ప్రపంచం మొత్తం వ్యాక్సినేషన్ కోసం పోటీ పడుతోంది. జగన్ రెడ్డి మాత్రం ప్రతిపక్షంపై తప్పుడు కేసులు నమోదు చేయడంపైనే దృష్టి పెట్టారు. వ్యాక్సిన్లు కొనుగోలుకు కేంద్రం అనుమతిచ్చినా రాష్ట్రం స్పందించడం లేదు. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ కూడా చేయలేని దుస్థితిలో ఉన్నారు. ఆర్డర్ చేయకుండా లేఖ రాస్తే వ్యాక్సిన్ ఎలా వస్తుంది జగన్ రెడ్డీ.? దేశంలోని రాష్ట్రాలన్నీ వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు పెడుతుంటే.. జగన్ లేఖలు రాస్తున్నారు.
పంచాయతీ భవనాలకు రూ.3 వేల కోట్లతో రంగులు వేశారు. సలహదార్లకు వందల కోట్లు జీతాలిస్తున్నారు. సాక్షి పత్రికకు వందల కోట్ల ప్రకటనలు ఇస్తున్నారు. కానీ వ్యాక్సిన్ల కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు.? బెడ్లు అందుబాటులో లేక ప్రజలు రోడ్లపై ప్రాణాలు వదులుతున్నా, కరోనా బాధితుల్ని అంబులెన్సు సిబ్బంది రోడ్డున పడేస్తున్నా ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదు. 108 ఎక్కడా కనిపించడం లేదని మీ తోడు దొంగ ఏ-2 చెప్పాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఆక్సిజన్ ఉత్పత్తి కోసం కేంద్రం ఏపీకి 10 ప్లాంట్లు కేటాయించింది. 45 రోజుల్లో ఒక్క ప్లాంటు నిర్మాణం కూడా జరగలేదు. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆక్సిజన్ తయారీని చూసి అయినా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు సెకెండ్ వేవ్ ప్రారంభానికి ముందే ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఆక్సిజన్ అందక రాష్ట్రంలో జరిగిన ప్రతి మరణం కూడా ప్రభుత్వ హత్యే.
జగన్ రెడ్డి అసమర్ధ పాలన, చేతకాని తనం వలనే రాష్ట్రంలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా జగన్ రెడ్డి నిద్రవీడి కరోనా, బ్లాక్ ఫంగస్‌పై అప్రమత్తం కావాలి. కరోనా నియంత్రణకు అధనపు నిధులు కేటాయించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మూడో దశలో చిన్నారులపై అధిక ప్రభావం చూపుతుందని హెచ్చరికల నేపథ్యలోం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చిన్నారుల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు.