Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంచ్ ప్ర‌భాక‌ర్ పై మండిప‌డుతున్న టీడీపీ... జైలుకు పంపాల‌ని...

పంచ్ ప్ర‌భాక‌ర్ పై మండిప‌డుతున్న టీడీపీ... జైలుకు పంపాల‌ని...
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 29 అక్టోబరు 2021 (11:33 IST)
పంచ్ ప్ర‌భాక‌ర్ కధ కంచికి. .. ఆయ‌న చివరకు జైలుకు పోవటం ఖాయం అంటున్నారు టీడీపీ నాయ‌కులు. బరి తెగించి నోటికొచ్చినట్లు ముఖ్య వ్యక్తులపై విమర్శలు, ఆరోపణలు చేస్తే, ఎవ‌రైనా త‌గిన  మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెపుతున్నారు. రేపో మాపో ఆయనకు జైలు శిక్ష ఖాయ‌మంటున్నారు... ఈ మేర‌కు సీనియర్‌ న్యాయవాదుల‌తో టీడీపీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు.
 
 
అమెరికాలో ప‌శువుల డాక్ట‌ర్ గా ఉద్యోగం చేసుకుంటూ, సోషల్‌మీడియాలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ వైసీపీకి కొమ్ము కాస్తున్నార‌ని పంచ్ ప్ర‌భాక‌ర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లున్నాయి. కారులో ప్రయాణిస్తూ.. వీడియోలో మాట్లాడుతూ, అటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌, టిడిపి ముఖ్యనేతలు, చివరకు న్యాయమూర్తులను కూడా ఆయన వదిలి పెట్టడం లేద‌ని ఆరోపిస్తున్నారు. న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును కూడా తప్పుబడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభావం ఆ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుపై స్పష్టంగా కనిపిస్తోంద‌ని పంచ్ ప్ర‌భాక‌ర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చేశారు.
 
తనకు నోరు ఉంది అని.. తాను వేరే దేశస్థుడునని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. ఇష్టం వచ్చినట్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి జైలు పాలు అవుతార‌ని టీడీపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ దేవుడని, ఆయనం పరిపాలన దక్షడు ఎవరూ లేరని.. కులాలను తెరపైకి తీసుకు వచ్చి తన కులంలో చంద్రబాబుపై మరింత వ్యతిరేకత పెంచేందుకు పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలపై పలువురు ధీటుగా ఆయనకు సమాధానం ఇచ్చినా.. కొద్ది రోజులు మౌనం వహించిన ప్రభాకర్‌ రెడ్డి మళ్లీ తాజాగా తెరపైకి వచ్చారు. అటు న్యాయమూర్తులను, ఇటు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయటం లేదు.
 
 
ఈ విషయంలో సిబిఐ అధికారులు అధికార ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న అనుమానానికి తావిస్తుంది. వెంటనే సిబిఐ ఎస్పీ న్యాయస్థానానికి హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. గ‌త సంవ‌త్సరంగా  పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డి న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌య‌ట‌కు తీసి, టార్గెట్ చేసే ప‌నిలో టీడీపీ నేత‌లున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో ఆయనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, న్యాయస్ధానంలో కేసు వేసినా పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డి మరింత రెచ్చిపోతున్నారే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ఇక నిన్న మొన్న జ‌రిగిన చంద్ర‌బాబు దీక్ష‌పై కూడా పంచ్ ప్ర‌భాక‌ర్ బుర‌ద జ‌ల్ల‌డంతో టీడీపీ నేత‌లు ఇక తాడో పేడో తేల్చుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ బంధానికి అడ్డుగా ఉందనీ.. భార్యను చంపి చెట్టుకు ఉరేసిన భర్త .. ఎక్కడ?