దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కేసును తారుమారు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కేసుతో సంబంధం లేని వారిని నిందితులుగా చూపబోతున్నారని అన్నారు. ఇదే విషయమై సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. వివేకా హత్య కేసులో ముద్దాయిలు ఎవరో సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరడం లేదన్నారు. వివేకాను ఎవరు హత్య చేయించారో పులివెందుల ప్రజలకు తెలుసునని అన్నారు.
పోలీసులు తమ నీతి నిజాయితీ చూపించుకునే కేసు ఇదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో డీజీపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. కీలక నేత హత్య కేసును ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
కేసు గురించి తెలుసుకునే హక్కు ఒక పౌరుడిగా తనకు ఉందని అన్నారు. కేసును మసిపూసి మారేడు కాయ చేస్తే చూస్తూ ఊరుకోబోమని రామయ్య స్పష్టం చేశారు.