టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. జగన్ మీద, వైసీపీ నేతల మీద మండిపడ్డారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ వైసీపీ మంత్రులు చేసిన విమర్శలపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట… భోజనంలో విషం కలపడం, బాబాయిని చంపేయడం వంటివి జగన్ డీఎన్ఏ అంటూ లోకేశ్ మండిపడ్డారు.
చంద్రబాబు ప్రజల మనిషని, ఎల్లప్పుడూ జనాల కోసమే పని చేశారని నారా లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు తనను, తన తల్లిని, భార్యను రోడ్డున పడేశారని మండిపడ్డారు.
టీడీపీ-జనసేన కలిస్తే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుపు ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని, డబ్బే సంపాదించాలని అనుకుంటే ఆయనకు రాజకీయాలే అవసరం లేదన్నారు.