Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రెచ్చగొట్టే ప్రకటనలు : కళా వెంకట్రావు

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రెచ్చగొట్టే ప్రకటనలు : కళా వెంకట్రావు
, శనివారం, 21 డిశెంబరు 2019 (10:57 IST)
తన ప్రభుత్వ పాలనావైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే, ముఖ్యమంత్రి జగన్‌, అసెంబ్లీ సాక్షిగా కొత్తభాష్యాలు చెప్పారని, తనమంత్రివర్గానికి కూడా సమాచారంలేకుండా, అమరావతిపై ఇష్టానుసారం ప్రకటనచేశాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు చెప్పారు. 
 
శుక్రవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనప్రభుత్వం రాజధానిపై నియమించిన జీఎన్‌.రావు కమిటీ నివేదిక రాకమునుపే ముఖ్యమంత్రి ఊహాగానాలు చేయడం రాజ్యాంగానికే విరుద్దమన్నారు. కులాలు, మతాలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో, 6 నెలల కాలంలో అవినీతే ధ్యేయంగా జగన్‌ పాలనసాగించాడని కళా ఆరోపించారు. 
 
తనవ్యాఖ్యలతో రాష్ట్రంలో తుగ్లక్‌పాలన నడుస్తోందని సీఎం రుజువు చేశాడని, ఆయన వచ్చినప్పటినుంచీ కూల్చివేతలు, రద్దులు, రివర్స్‌లే సరిపోయాయన్నారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి, రేషన్‌బియ్యానికి పాలిష్‌పట్టి పంపిణీచేసే దుస్థితికి రాష్ట్రప్రభుత్వం దిగజారిందని వెంకట్రావు మండిపడ్డారు. పింఛన్లు, చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్లి కానుక, క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలు, రంజాన్‌తోఫాలు, అన్నాక్యాంటీన్లమూత, పోలవరం పనుల నిలిపివేతే కొనసాగిందన్నారు. 
 
రివర్స్‌టెండర్ల పేరుతో డబ్బులు మింగడంతప్ప, ప్రజల గురించి ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. రాష్ట్రంలో రైతులపరిస్థితి మరీదారుణంగా తయారైందని, ఇప్పటివరకు పండినపంటలు కొనుగోలుచేయకపోవడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. గిట్టుబాటుధర విషయంలో ప్రభుత్వం ప్రకటనలకే సరిపోయిందని, ఊరికో ఫ్లెక్సీ ఏర్పాటుచేసింది తప్ప ఎక్కడా ఒక్కబస్తా ధాన్యం కూడా కొనలేదన్నారు. సబ్సిడీపై రైతులకు అందించే వ్యవసాయపరికరాల పంపిణీ నిలిపివేసిన ప్రభుత్వం, నీటిపారుదలరంగ ప్రాజెక్టులు కూడా నిలిపివేసిందన్నారు. 
 
పేదలఉపాధి కోసం పెట్టిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని నిలిపివేసిన వైసీపీసర్కారు, చేసినపనులకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వకుండా కూలీలు, కాంట్రాక్టర్లను వేధిస్తోందన్నారు. టీడీపీ పాలనలో రూ.1200లకు లభించిన ట్రక్కుఇసుక, ఇప్పుడు రూ.4 నుంచి 5 వేలకు చేరిందని, ఇసుకకొరత సృష్టించి 50మంది చావులకు ఈ ప్రభుత్వం కారణమైందన్నారు. వైసీపీ మాఫియా అంతా ఇసుకను దోచేస్తూ, ఎక్కువధరలకు అమ్మడంకోసమే 6 నెలల్లో భవననిర్మాణ కార్మికుల చావులకు పాల్పడిందని కళా ఆగ్రహంవ్యక్తం చేశారు. 
 
విద్యుత్‌ రంగంలో పీపీఏలరద్దుతో, ప్రభుత్వం ఏం సాధించిందన్నారు. కేంద్రం కర్రుకాల్చి వాత పెట్టినా మారకుండా చివరకు రాష్ట్రాన్ని చీకట్లపాలు చేశారన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి, సామాన్యుడిపై రూ.700కోట్ల వరకు భారం మోపడం ద్వారా పరిపాలనలో విఫలమయ్యారని సుస్పష్టంగా అర్థమవుతోందన్నారు. తన వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికే, అసెంబ్లీలో ఆదరాబాదరాగా జగన్‌ 3 రాజధానుల ప్రకటనచేశాడని వెంకట్రావు తేల్చిచెప్పారు. 
 
ప్రతిపక్షనేతగా ఆనాడు రాజధానిని సమర్థించిన జగన్‌, నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజల్ని గందరగోళానికి గురిచేసేలా ప్రకటనలివ్వడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ విబేధాలతో, కులమతాలతో చిచ్చుపెట్టడంద్వారా జగన్‌ రాష్ట్రాన్ని ఏంచేయనున్నాడనే ఆందోళన కలుగుతోందన్నారు. విశాఖలో ఏర్పాటుకావాల్సిన లులూ, ఆదానీ గ్రూప్‌ సంస్థలు వెనక్కువెళ్లడానికి జగన్‌ వైఖరికారణం కాదా అని టీడీపీనేత కళా వెంకట్రావు నిలదీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ఎలాంటి సంబంధం లేదు.. తితిదే ఛైర్మన్ వైవీ